ఎల్బీనగర్,మహా: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.మంగళవారం హయత్ నగర్ లోని దత్తాత్రేయ నగర్ కాలనీలోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్,నగదు,బంగారం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.ఎలాంటి అర్హత లేకుండా స్కానింగ్స్ చేస్తున్న ఓ స్కానింగ్ నిర్వహకునిపై అధికారుల నుండి ఫిర్యాదు రాగా నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోకుండా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసేందుకు డిఎస్పీ,సీఐ లంచం డిమాండ్ చేయడంతో ఆ కేసులో ఉన్న నిందితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి డీఎస్పి పార్థసారథి, సీఐ వీరరాఘవులుపై కేసు నమోదు చేసి వారి ఇండ్లలో దాడులు నిర్వహించారు.
డిఎస్పీ ఇంట్లో బుల్లెట్స్ కలకలం…
ఏసీబీ కేసులో డీఎస్పీ పార్థసారథి ఇంట్లో తనికీ చేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు షాక్ కు గురయ్యారు.సాధారణంగా ఆ స్థాయి అధికారి వద్ద డిపార్ట్మెంట్ రివాల్వర్ ఉంటుంది దానికి సంబంధించిన ఓ మ్యాగ్జిన్ ఉంటుంది.కానీ ఈ అధికారి ఇంట్లో అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్ చేసిన బుల్లెట్స్ క్యాప్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు.ఇంట్లో అక్రమంగా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారి మురళి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు డీఎస్పీ పార్థసారధిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పార్ధ సారధి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి..? ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి..? యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడ యూజ్ చేసినవి అని..? వాటిని ఎక్కడ ఉపయోగించారు అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కాగా డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో రూ.16 లక్షల చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన అధికారులు డిఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలోనే వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.







