Mahaa Daily Exclusive

  105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.!.

Share

• 37 ఏళ్లుగా సాగిన హత్య కేసు.
• మిగిలిన జీవిత ఖైదు శిక్ష రద్దు.

ఢిల్లీ, మహా.

హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. వయసు, దీర్ఘకాలంగా సాగుతున్న న్యాయపరమైన ప్రక్రియను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆయనకు విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. దీంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన రసిక్‌ చంద్ర మొండల్‌ జీవిత ఖైదు నుంచి విముక్తి పొందారు.

మల్దా జిల్లాకు చెందిన రసిక్‌ చంద్ర మొండల్‌ 1920లో జన్మించారు. 1988లో నమోదైన హత్య కేసులో ఆయన జైలుకు వెళ్లారు. కేసును విచారించిన న్యాయస్థానం 1994లో ఆయనను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అయితే తనకు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ మొండల్‌ న్యాయపోరాటం కొనసాగించారు.

2018 నుంచి న్యాయపోరాటం

శిక్షను సవాల్‌ చేస్తూ 2018లో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అనుకూల ఫలితం రాలేదు. చివరకు తన వయసును పరిగణనలోకి తీసుకుని మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేసి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 నవంబర్‌ 29న మొండల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం కేసు తుది విచారణకు వచ్చింది.

వయసును పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం

శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ వయసు, కేసు సాగిన సుదీర్ఘ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ దశలో కేసును ముగించేందుకు నిర్ణయించింది.

మొండల్‌కు విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో 105 ఏళ్ల వయసులో ఆయనకు జీవిత ఖైదు నుంచి విముక్తి లభించింది.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెరపడింది. వృద్ధాప్యం, మానవతా కోణాలను పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Latest