- చరిత్ర సృష్టించిన ట్రీసా–గాయత్రి
- సత్తా చాటిన భారత జోడీ
- 15 ఏళ్ళ తర్వాత తొలి పతకం
న్యూఢిల్లీ, మహా : భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ అరుదైన ఘనత సాధించింది. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత పోరాటంతో సెమీఫైనల్‌కు చేరిన ఈ భారత జంట.. చివరకు కాంస్య పతకంతో టోర్నీని ముగించింది. ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ చైనా జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ చేతిలో ఓటమి ఎదురైనా.. భారత బ్యాడ్మింటన్‌కు 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్‌లో పతకాన్ని అందించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ పోరులో ట్రీసా–గాయత్రి ఆరంభంలో అద్భుతంగా ఆడారు. తొలి గేమ్‌లో చైనా జోడీపై ఆధిపత్యం ప్రదర్శించి 21-18తో గెలిచారు. అయితే ఆ తర్వాత ప్రపంచ నంబర్ వన్ జంట తన అనుభవాన్ని చూపించింది. తొలి గెమ్ అనంతరం.. వరుసగా రెండు గేమ్‌లలో భారత జోడీపై పైచేయి సాధించి 21-13, 21-8తో విజయం సాధించింది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ట్రీసా–గాయత్రి జోడీ ప్రయాణం అసాధారణంగా సాగింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన భారత జంట.. వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. క్వార్టర్ఫైనల్లో నాలుగో సీడ్ చైనా జోడీ జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్‌పై సంచలన విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాతి రెండు గేమ్‌లలో అద్భుతంగా పుంజుకుని విజయం అందుకుంది.
15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్ పతకం
ట్రీసా-గాయత్రి సాధించిన కాంస్యంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్ 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చివరిసారిగా 2011లో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ టోర్నీలో ట్రీసా-గాయత్రి తొలిరౌండ్ నుంచి అద్భుత ప్రదర్శన చేశారు. స్పెయిన్‌కు చెందిన పౌలా లోపెజ్–లూసియా రోడ్రిగ్స్ జోడీని ఓడించి శుభారంభం చేసిన భారత జంట.. అనంతరం అమెరికా జోడీ లారెన్ లామ్–అలిసన్ లీపై విజయం సాధించింది. ప్రీ క్వార్టర్లో జపాన్ ఏడో సీడ్ జోడీ రిన్ ఇవానాగా–కీ నకనిషిని ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
సత్తా చాటిన భారత జోడీ
సెమీఫైనల్లో ఓటమి ఎదురైనా ట్రీసా–గాయత్రి పోరాటం అభిమానుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచ అగ్రశ్రేణి జోడీపై తొలి గేమ్‌లో ఆధిపత్యం చెలాయించడం వారి సామర్థ్యాన్ని చాటింది. మరోవైపు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల జోడి క్వార్టర్‌ఫైనల్స్‌లో చైనా జోడి చేతిలో ఓడిపోయింది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ గెలుచుకున్న ఏకైక డబుల్స్ పతకం .. ట్రీసా–గాయత్రిల కాంస్యమే.






