Mahaa Daily Exclusive

  నషా ముక్త్ భారత్ అభియాన్..

Share

  • నషా ముక్త్ భారత్ అభియాన్
  • 400 మంది యువతతో మత్తు వ్యసనాల వ్యతిరేక ప్రతిజ్ఞ
  • హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
  • హాజరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యువతీయువకులు
  • మార్పు నాతోనే ప్రారంభమవుతుంది” అంటూ యువత సంకల్పం

హైదరాబాద్, మహా
దేశ భవిష్యత్తు అయిన యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సుమారు 400 మంది యువతీయువకులు మత్తు వ్యసనాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు సత్య గౌర చంద్ర ప్రభుజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సైతం యువతతో కలిసి ప్రతిజ్ఞలో భాగస్వామ్యమయ్యారు. మత్తు రహిత జీవన విధానంపై యువతలో అవగాహన కల్పించే బలమైన సందేశాన్ని వారు ప్రజల్లోకి తీసుకెళ్లారు.

క్షేమకరమైన జీవనమే లక్ష్యంగా
ఈ ప్రతిజ్ఞా వేదికగా యువత తమ శరీరం, మనస్సు, బుద్ధి మరియు చైతన్యాన్ని పరిరక్షించుకుంటామని, ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారబోమని శపథం చేశారు. క్షణిక ఆనందాల కోసం తమ స్వేచ్ఛను, ఉన్నత విలువలను త్యాగం చేయబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మార్పు నాతోనే ప్రారంభమవుతుంది అనే నినాదాన్ని యువత ప్రధానంగా స్వీకరించారు. తాము మారడంతో పాటు తమ కుటుంబాలు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజాన్ని కూడా మత్తు అలవాట్ల నుంచి దూరం చేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరినీ మత్తు వైపు ప్రోత్సహించకుండా సమాజానికి సానుకూల ఆదర్శంగా నిలుస్తామని తీర్మానించుకున్నారు. నగరం, రాష్ట్రం, దేశాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ఉద్ఘాటించారు.

స్వేచ్ఛా, ఆత్మనిగ్రహాలకు ప్రతీక మత్తు రహిత జీవనం: సత్య గౌర చంద్ర ప్రభుజీ

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్య గౌర చంద్ర ప్రభుజీ మాట్లాడుతూ.. మత్తుకు దూరంగా ఉండటం అనేది కేవలం ఒక అలవాటును వదిలివేయడం మాత్రమే కాదన్నారు. అది స్వేచ్ఛ, ఆత్మనిగ్రహం, అపారమైన శక్తి మరియు లక్ష్యబద్ధమైన జీవన విధానాన్ని ఎంచుకోవడమని ఆయన పేర్కొన్నారు. యువత తమ కుటుంబాలు, తోటివారికీ, సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలిచి నవశకానికి, మత్తు రహిత భారత నిర్మాణానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిజ్ఞ కేవలం ఒక తంతుగా కాకుండా జీవితాంతం ఆచరణలో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి నుంచి మొదలయ్యే ఈ చిన్న మార్పు.. రాబోయే రోజుల్లో కుటుంబం, సమాజంపై మరియు దేశవ్యాప్తంగా సానుకూల ప్రభావాన్ని చూపాలని కోరుకున్నారు.

Latest