Mahaa Daily Exclusive

  నిర్మాణాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడాలి..!ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్‌ ఆకృతులపై సీఎం సమీక్ష..

Share

• ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్‌ ఆకృతులపై సీఎం సమీక్ష.
• చారిత్రక కట్టడాల స్ఫూర్తితో డిజైన్లు రూపొందించాలని ఆదేశం.
హైదరాబాద్, మహా.

అంతర్గత సమన్వయంతో పనులు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలతో పాటు ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న తెలంగాణ భ‌వ‌న్ ఆకృతులు రాష్ట్ర చ‌రిత్ర‌, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాలయాల శిల్ప‌, వాస్తు క‌ళ‌లు ఉట్టిపడేలా ఈ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎయిర్‌పోర్టులు, ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రూపొందించిన పలు నిర్మాణ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఆకృతులకు సంబంధించి పలు కీలక మార్పులను సూచించారు. ప్రతి కట్టడంలోనూ తెలంగాణ వైభవం, వాస్తు, శిల్ప కళలకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు.
విమానాశ్ర‌యాల నిర్మాణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్, బీఎస్ఎన్ఎల్ లైన్ల తరలింపు, తాగునీటి సరఫరా లైన్లు, వాగుల ప్ర‌వాహ దిశ మార్పు, ర‌హ‌దారుల మ‌ళ్లింపు తదితర అడ్డంకులను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. ఏ శాఖ‌కు ఆ శాఖ విడివిడిగా ప‌నులు చేప‌డితే అనేక ఇబ్బందులు, తీవ్ర జాప్యం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్‌, ఆర్ అండ్ బీ, తాగునీటి స‌ర‌ఫ‌రా, నీటి పారుద‌ల శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుని, బీఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి ఏక‌కాలంలో ప‌నులు సాగేలా చూడాలని ఆదేశించారు. కేవలం ప్రస్తుత అవ‌స‌రాల‌నే కాకుండా భవిష్యత్ అవసరాలను సైతం పరిగణనలోకి తీసుకుని స‌మ‌గ్ర ప్ర‌ణాళికతో పనులు ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ అడుగులు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విమానాశ్రయాల వద్ద వాగులు, ఇత‌ర నీటి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించాల్సి వ‌స్తే.. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో లేదా స‌మీపంలోనే చెరువుల‌ను నిర్మించి, అక్క‌డి నుంచే ఆ ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. విమానాశ్ర‌యాల‌కు రాకపోకలు సాగించే ర‌హ‌దారులు అత్యంత విశాలంగా ఉండాలని చెప్పారు. విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ వెంబడి ర‌హ‌దారులను నిర్మించి, వాటిని స‌మీపంలోని జిల్లా, రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానించాలని ఆదేశించారు. సమన్వయంతో అడ్డంకులన్నీ అధిగమించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐల‌య్య‌, ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest