Mahaa Daily Exclusive

  ఎర్రజెండాకు ఏమైంది? విశ్వవ్యాప్తంగా కమ్యూనిజం సంక్షోభం…

Share

మానవ చరిత్ర గమనాన్ని మలుపు తిప్పి, దోపిడీలేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా శ్రామికవర్గాన్ని ఏకం చేసిన ఎర్రజెండా నేడు ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రంగా ఆరాటపడుతోంది. ఇరవయ్యో శతాబ్దపు రాజకీయ యవనికను శాసించి, సామ్రాజ్యవాద శక్తులకు సింహస్వప్నంగా నిలిచిన మార్క్సిస్టు సిద్ధాంతం.. ఇరవై ఒకటో శతాబ్దపు మూడో దశాబ్దానికి వచ్చేసరికి తీవ్ర సైద్ధాంతిక, సంస్థాగత సంక్షోభంలో కూరుకుపోయింది. లెనిన్, స్టాలిన్ల గడ్డ రష్యా మొదలుకొని భారతదేశం వరకు, యూరప్ నుంచి లాటిన్ అమెరికా వరకు కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం క్రమంగా మసకబారుతోంది. ఒకప్పుడు ప్రపంచ జనాభాలో మూడో వంతును ప్రభావితం చేసిన ఈ సిద్ధాంతం, నేడు ఓటర్ల మదిని గెలవలేక ఎందుకు వెనుకబడుతోంది? ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలను ఆకర్షించే సరికొత్త రాజకీయ భాషను నిర్మించుకోవడంలో ఎక్కడ విఫలమవుతోంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి.
పుతిన్ ప్రభంజనంలో మాస్కో ఎర్రకోట కుదేలు
బోల్షెవిక్ విప్లవానికి జన్మనిచ్చి ప్రపంచ విప్లవాలకు కేంద్రబిందువుగా నిలిచిన రష్యాలోనే కమ్యూనిస్టు పార్టీ తీవ్ర పతనాన్ని చవిచూస్తోంది. సోవియట్ యూనియన్ పతనానంతరం 1995 నాటి రష్యా పార్లమెంట్ (స్టేట్ డ్యూమా) ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏకంగా 157 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచారు. అయితే, వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఆధిపత్యం పెరిగేకొద్దీ కమ్యూనిస్టుల ప్రభావం నామమాత్రంగా మారింది. తాజా ఎన్నికల్లో యునైటెడ్ రష్యా 355 స్థానాలతో రికార్డు విజయం సాధించగా, కమ్యూనిస్టులు కేవలం 40 స్థానాలకే పరిమితం కావడం వారి దీర్ఘకాలిక క్షీణతకు నిదర్శనం. యువతను ఆకర్షించే ఆధునిక సామాజిక-ఆర్థిక ఎజెండా లేకపోవడం, దశాబ్దాలుగా పాతతరం నాయకుల చేతుల్లోనే పార్టీ బందీ కావడం, పుతిన్ రాజ్యంలో పెరుగుతున్న జాతీయవాద ప్రవాహాన్ని తట్టుకోలేకపోవడమే మాస్కోలో కమ్యూనిస్టుల తిరోగమనానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
భారతదేశంలో పరిమితమైన ప్రాభవం
భారత రాజకీయ యవనికపై శ్రామిక, కార్మిక, కర్షక ఉద్యమాల ద్వారా బలమైన ముద్ర వేసిన వామపక్షాలు నేడు అసాధారణ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా నిరాటంకంగా పాలించిన పశ్చిమ బెంగాల్‌లో, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న త్రిపురలో వామపక్షాలు అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, శాసనసభల్లో సైతం ప్రాతినిధ్యం కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ తదితర వామపక్షాలు రికార్డు స్థాయిలో 60కి పైగా ఎంపీ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో యూపీఏ-1 ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకంగా మారాయి. అయితే ఆ గరిష్ఠ స్థాయి నుంచి 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి లోక్‌సభలో వామపక్షాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం కేరళ మాత్రమే వామపక్షాలకు బలమైన రాజకీయ కోటగా మిగిలి ఉంది.
భారత్‌లో వామపక్షాల క్షీణతకు కేవలం రాజకీయ ఓటములు మాత్రమే కారణం కాదు.. శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ సంక్లిష్టతలను, అట్టడుగు వర్గాల సామాజిక ఆకాంక్షలను కేవలం ఆర్థిక కోణంలోనే విశ్లేషించే మూస వైఖరి పార్టీలను దెబ్బతీసింది. ఆర్థిక సరళీకరణ తర్వాత దేశంలో పెరిగిన మధ్యతరగతి ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో, సాంకేతిక విప్లవం తెచ్చిన మార్పులకు అనుగుణంగా ఉద్యమ రూపాలను మార్చడంలో భారత కమ్యూనిస్టులు తీవ్ర జాప్యం చేశారు. సంస్థాగతంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం, ఓటర్లను ఆకట్టుకునే ఆచరణాత్మక వ్యూహాల లేమి వెరసి జాతీయ రాజకీయాల్లో వామపక్షాల పాత్రను అంచులకు నెట్టివేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎడారిగా మారిన వామపక్ష క్షేత్రం
ప్రపంచవ్యాప్తంగా చూస్తే సాంప్రదాయ మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావజాలం చాలావరకు తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. చైనా అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ పాలనలోనే కొనసాగుతున్నప్పటికీ, దాని ఆర్థిక విధానాలు మార్కెట్ సోషలిజం పేరిట పూర్తి పెట్టుబడిదారీ ఆర్థిక సూత్రాలతో ముడిపడి ఉన్నాయి. ఉత్తర కొరియా కమ్యూనిజం స్థానంలో వంశపారంపర్య నియంతృత్వ ‘జుచే’ సిద్ధాంతాన్ని అమలు చేస్తుండగా, వియత్నాం సైతం ‘దోయ్ మోయ్’ సంస్కరణలతో ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో భాగస్వామిగా మారింది. క్యూబా తీవ్ర ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటూ మనుగడ కోసం ఆరాటపడుతోంది.
యూరప్‌లో ఒకప్పుడు ప్రభావం చూపిన ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల కమ్యూనిస్టు పార్టీలు నేడు చరిత్ర పుటలకే పరిమితమయ్యాయి. లాటిన్ అమెరికాలో అప్పుడప్పుడు ‘పింక్ టైడ్’ (వామపక్ష మొగ్గు కలిగిన ప్రభుత్వాలు) అధికారంలోకి వస్తున్నప్పటికీ, అవి సాంప్రదాయ కమ్యూనిస్టు భావజాలం కంటే ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య సోషలిజం ఆధారంగానే మనుగడ సాగిస్తున్నాయి. సాంప్రదాయ శ్రామికవర్గ నిర్వచనాలు మారిపోయి, గిగ్ ఎకానమీ, సర్వీస్ సెక్టార్, కృత్రిమ మేధస్సు విస్తరిస్తున్న వేళ.. పాత పారిశ్రామిక విప్లవ కాలం నాటి నినాదాలు ఓటర్లను ప్రభావితం చేయలేకపోతున్నాయి.
పునరుజ్జీవనానికి సమూల మార్పే మార్గం
అసమానతలు పెరిగిపోతున్న ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజానుకూల వామపక్ష భావజాలం, ప్రశ్నించే ప్రతిపక్ష స్వరం ఎంతో అవసరమనేది నిర్వివాదాంశం. కార్మిక హక్కులు, ప్రజాారోగ్యం, ఉచిత విద్య, సామాజిక భద్రత వంటి అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు సాధించిన చారిత్రక విజయాలు ఎవరూ కాదనలేనివి. కానీ, సిద్ధాంతం పుస్తకాలకే పరిమితమై, ఆచరణ జనజీవన స్రవంతికి దూరమైనప్పుడు రాజకీయ పతనం అనివార్యమవుతుంది.
ఎర్రజెండా మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే.. సోవియట్ కాలం నాటి మూస ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే కేంద్రంగా సరికొత్త విధానాలను రూపొందించుకోవాలి. ఆధునిక యువత ఆలోచనలకు తగినట్లుగా డిజిటల్ శకపు సవాళ్లను స్వీకరించి, పర్యావరణ సంక్షోభం, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షలపై స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించగలగాలి. పాత నినాదాలు, వృద్ధ నాయకత్వ చట్రాలను బద్దలుకొట్టి వర్తమాన వాస్తవాలకు అనుగుణంగా మారినప్పుడే ఎర్రజెండాకు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భవిష్యత్తు సాధ్యమవుతుంది.

**గడల నరసింహారావు. మహా పత్రిక అసోసియేట్ ఎడిటర్**