• ఔషధ ధరల భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.
• ప్రాణాంతక వ్యాధుల మందుల ధరల నియంత్రణపై కీలక ప్రశ్నలు.
ఢిల్లీ, మహా.
ప్రాణాలను కాపాడే కీలకమైన ఔషధాల ధరల నిర్ణయంలో ఉన్న భారీ వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తయారీదారులు రిటైలర్లకు విక్రయించే ధరకు, ఔషధ ప్యాకెట్‌పై ముద్రించే గరిష్ట చిల్లర ధరకు (ఎంఆర్పీ) మధ్య ఏకంగా పది రెట్ల వ్యత్యాసం ఉండటంపై ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. తయారీదారు నుంచి రిటైలర్‌కు రూ.2,700కే లభించే క్యాన్సర్ ఔషధానికి ప్యాకెట్‌పై రూ.27,000 ఎంఆర్పీని ఎలా నిర్ణయిస్తారని కోర్టు సూటిగా ప్రశ్నించింది. ఔషధ ధరల నియంత్రణ విధానంలో ఉన్న లోపాలను ఈ ఒక్క ఉదాహరణ స్పష్టంగా ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించింది.
కిషన్ చంద్ జైన్ తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సామాన్యుల ఆర్థిక పరిస్థితిని న్యాయమూర్తులు ప్రస్తావించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన కుటుంబాలు.. ఆ అధిక చికిత్స ఖర్చులు, మందుల భారం భరించలేక సొంత ఇళ్లు, బంగారు ఆభరణాలు సైతం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొనడం పట్ల ధర్మాసనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి తరుణంలో ఔషధ ధరల నియంత్రణ వ్యవస్థలు ప్రజల ప్రయోజనాలను ఏమేరకు కాపాడుతున్నాయనే ప్రశ్నను లేవనెత్తింది. తాము రిటైలర్లకు తక్కువ ధరకే మందులు విక్రయిస్తున్నామని తయారీదారులు వాదిస్తే.. మరి ప్యాకెట్‌పై అంత భారీ ఎంఆర్పీని ముద్రిస్తోంది ఎవరని కోర్టు నిలదీసింది. ఔషధాలపై ఇంత భారీ స్థాయిలో ఎంఆర్పీని నిర్ణయిస్తే, అది కేవలం సామాన్యులకే కాకుండా ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల ద్వారా ప్రజాధనంపైనా పెను భారం మోపుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
భారతీయ ఔషధ మార్కెట్‌లో సుమారు 80 నుంచి 82 శాతం వాటా ‘నాన్-షెడ్యూల్డ్’ మందులదేనని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) ఇదివరకే వెల్లడించింది. అయితే, ప్రభుత్వం అన్ని మందుల ధరలను గాలికొదిలేసిందనడం పూర్తి వాస్తవం కాదు. షెడ్యూల్డ్ మందుల కింద ఉన్న 935 ఔషధాలకు ఎన్‌పీపీఏ గరిష్ట ధరలను నిర్ణయించింది. ఇందులో 131 క్యాన్సర్ మందులు కూడా ఉన్నాయి. అలాగే, నాన్-షెడ్యూల్డ్ మందుల విషయంలోనూ గత 12 నెలల్లో ఉన్న గరిష్ట ధరపై కేవలం 10 శాతం మాత్రమే పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయినప్పటికీ, వాస్తవ ఉత్పత్తి వ్యయం, రిటైలర్‌కు అమ్మే ధర, ప్యాకెట్‌పై ముద్రించే గరిష్ట ధరకు మధ్య ఇంత భారీ అంతరం ఎందుకు ఉంటోందన్నదే ఇప్పుడు న్యాయస్థానం ముందున్న ప్రధాన ప్రశ్న. ప్రతి దశలోనూ ఈ ధరల నిర్ణయం ఏ ప్రాతిపదికన జరుగుతోందన్న దానిపై సమగ్ర పరిశీలన జరగాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో ప్రాణదాతలైన ఔషధాల ధరల నిర్ణయంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం అవసరమన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.







