న్యూఢిల్లీ, మహా : పూర్తి వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగత నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలు ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరు చరణాలను తప్పనిసరి చేయడంపై ప్రముఖ సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వందేమాతరంలోని చివరి నాలుగు చరణాల్లో హిందూ దేవతలను ఉద్దేశించిన అంశాలు ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా పాడేలా చేయడం రాజ్యాంగంలోని లౌకిక విలువలకు విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా, ఒక నిర్దిష్ట మతపరమైన సందేశాన్ని ప్రోత్సహించేలా చట్ట సవరణ ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. పూర్తి చరణాలు పాడని వారిపై చర్యలు తీసుకోలేరని ఈ సందర్భంగా సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వందేమాతరం పాడని వారిపై కేంద్రం తీసుకునే చర్యల అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించింది. వందేమాతరం సవరణ చట్టం, మార్గదర్శకాలపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.







