Mahaa Daily Exclusive

  దళితులు, గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం..! రాజకీయాలకు అతీతంగా అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలి..: సీఎం రేవంత్ రెడ్డి..

Share

  •  బాధితులకు ‘గ్రీన్ ఛానల్’ ద్వారా పరిహారం.
  •  తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఎస్సీ,
  • ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి సమీక్ష.
  •  రాజకీయాలకు అతీతంగా అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలి.
  •  సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని ఉద్ఘాటన
దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అణగారిన వర్గాలపై అణిచివేతను రూపుమాపేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (1989) అమలుపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ తరహా సమావేశం జరగ్గా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం అమలు, నమోదవుతున్న కేసులు, దర్యాప్తు, బాధితులకు అందుతున్న పునరావాసం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని, అయితే ప్రధానంగా 73 గ్రామాల్లో మాత్రం ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం.. ఆయా గ్రామాలపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ఆదేశించారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ మానవీయ కోణంలో స్పందిస్తుందని, బాధితులకు సకాలంలో నష్టపరిహారం, పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో బడ్జెట్‌తో ముడిపెట్టకుండా ‘గ్రీన్ ఛానెల్’ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఇటీవల సంచలనం సృష్టించిన షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడ నర్సు హత్యాచారం కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. ఆయా బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
అణగారిన వర్గాల కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు 25 లక్షల ఎకరాల భూములకు అసైన్డ్ పట్టాలు పంపిణీ చేసిన ఘనత ఇందిరమ్మదేనని, ఆ తల్లి స్ఫూర్తితోనే నేటి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని, రాష్ట్రంలో 16 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 31 శాతం ఇందిరమ్మ ఇండ్లు, 10 శాతం ఉన్న ఎస్టీలకు 17 శాతం ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 27.5 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు, 3.48 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని వెల్లడించారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, చదువు మాత్రమే బడుగు బలహీన వర్గాల జీవితాలను మారుస్తుందని, పిల్లలను విద్య, క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారానే అట్టడుగు వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

Latest