Mahaa Daily Exclusive

  ఆర్థిక వృద్ధికి న్యాయ వ్యవస్థే వెన్నెముక..! ఉమ్మడి న్యాయ భాండాగారానికి ప్రతిపాదన: సీజేఐ సూర్యకాంత్

Share

• బ్రిక్స్‌ ప్లస్‌ దేశాల మధ్య న్యాయ సహకారానికి న్యాయసేతు.
• న్యాయనామిక్స్‌’తో చట్టబద్ధ పాలన, ఆర్థిక ప్రగతికి అనుసంధానం.
• ఉమ్మడి న్యాయ భాండాగారానికి ప్రతిపాదన.
సీజేఐ సూర్యకాంత్

ఢిల్లీ, మహా.
ఒక దేశం స్థిరమైన, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించాలంటే భౌగోళిక విస్తీర్ణం, సహజ వనరులు మాత్రమే సరిపోవని.. బలమైన సంస్థలు, ప్రజల్లో విశ్వాసం, పాలనా సామర్థ్యం, చట్టబద్ధ పాలనే అసలు పునాదులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. వేగవంతమైన ఆర్థిక పురోగతికి బలమైన న్యాయ వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన 11వ బ్రిక్స్‌ ప్లస్‌ లీగల్‌ ఫోరంలో ‘బహుధ్రువ ప్రపంచంలో చట్టబద్ధ పాలన: ఆర్థిక స్థితిస్థాపకత కోసం న్యాయ సామర్థ్య నిర్మాణం’ అంశంపై జరిగిన ప్రారంభ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు.

ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, వాణిజ్యం, ఒప్పందాలు, సరిహద్దులు దాటి జరిగే లావాదేవీలు పెరిగే కొద్దీ వాటికి నమ్మదగిన న్యాయ వ్యవస్థ అవసరం మరింత పెరుగుతుందని సీజేఐ అన్నారు. న్యాయస్థానాలు సకాలంలో తీర్పులు ఇవ్వడం, ఒప్పందాల అమలుకు భరోసా కల్పించడం, చట్టపరమైన అనిశ్చితిని తగ్గించడం వల్ల దేశంపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని వివరించారు. న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత, ఊహించగలిగే విధానం, స్థిరత్వం ఉంటేనే ఆర్థిక వృద్ధి బలమైన పునాదులపై కొనసాగుతుందని చెప్పారు.

‘న్యాయనామిక్స్‌’.. చట్టం నుంచి ఆర్థిక శక్తి వరకు

ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ కొత్తగా ‘న్యాయనామిక్స్‌’ అనే భావనను ప్రతిపాదించారు. ‘న్యాయ’–‘ఎకనామిక్స్‌’ను అనుసంధానించే ఈ భావన ద్వారా చట్టబద్ధ పాలన, న్యాయ వ్యవస్థ సామర్థ్యం, ఆర్థిక వృద్ధి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని వివరించారు.

ఆయన దృష్టిలో న్యాయనామిక్స్‌ అంటే కేవలం న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం కాదు. బలమైన న్యాయ సంస్థలు ఆర్థిక కార్యకలాపాలకు ఎలా విశ్వాసాన్ని కల్పిస్తాయి, సకాలంలో న్యాయం పెట్టుబడులకు ఎలా భరోసా ఇస్తుంది, సమర్థవంతమైన ఒప్పందాల అమలు వాణిజ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది అనే అంశాలను ఒకే దృక్పథంలో చూడటం. బ్రిక్స్‌ ప్లస్‌ దేశాల ఆర్థిక సహకారం మరింత విస్తరించాలంటే ఈ న్యాయ–ఆర్థిక అనుసంధానం కీలకమని సీజేఐ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ విభేదాలు, వాణిజ్య పరమైన అడ్డంకులు పెరుగుతున్న సమయంలో న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర అవగాహన మరింత అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ స్థాయిలో ఒప్పందాలు కుదిరిన తర్వాత వాటిని అమలు చేయడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థలు అవసరమని, అందుకే బ్రిక్స్‌ ప్లస్‌ సహకారంలో న్యాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని వివరించారు.

‘న్యాయసేతు’.. 11 న్యాయ సంప్రదాయాలకు వారధి

బ్రిక్స్‌ ప్లస్‌ దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీజేఐ మరో కీలక భావనను ప్రతిపాదించారు. అదే ‘న్యాయసేతు’. భిన్నమైన న్యాయ సంప్రదాయాలు, చట్ట వ్యవస్థలు, న్యాయపద్ధతుల మధ్య వారధిగా ఈ వ్యవస్థ పనిచేయాలని ఆయన సూచించారు.

బ్రిక్స్‌ ప్లస్‌ దేశాల్లోని న్యాయస్థానాల తీర్పులు, ముఖ్యమైన న్యాయ సూత్రాలు, చట్టపరమైన పరిణామాలను ఒక ఉమ్మడి డిజిటల్‌ భాండాగారంలో అందుబాటులో ఉంచాలని ఆయన ప్రతిపాదించారు. ఒక దేశంలోని న్యాయస్థానం ఎదుర్కొంటున్న ప్రశ్నకు మరో బ్రిక్స్‌ దేశంలో ఇప్పటికే తీర్పు వెలువడి ఉంటే.. ఆ తీర్పును సులభంగా తెలుసుకునే అవకాశం ఉండాలని చెప్పారు.

భారత్‌లో న్యాయ ప్రక్రియలను డిజిటలైజ్‌ చేస్తున్న అనుభవాన్ని దీనికి ఉపయోగించుకోవచ్చని సీజేఐ సూచించారు. ఈ ఉమ్మడి న్యాయ భాండాగారం ఏర్పడితే బ్రసీలియా, న్యూఢిల్లీ లేదా ఇతర బ్రిక్స్‌ దేశాల న్యాయస్థానాల్లో వెలువడిన తీర్పులు సంబంధిత చట్టపరమైన ప్రశ్నలను ఎదుర్కొనే ఇతర దేశాల న్యాయమూర్తులకు వేగంగా అందుబాటులోకి వస్తాయి. దీంతో ఒకే రకమైన న్యాయ సమస్యపై వేర్వేరు దేశాల న్యాయ వ్యవస్థలు పరస్పర అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.

జుడీషియల్‌ ఫెలోషిప్‌కు ప్రతిపాదన

‘న్యాయసేతు’తో పాటు బ్రిక్స్‌ ప్లస్‌ జుడీషియల్‌ ఫెలోషిప్‌ ఏర్పాటు చేయాలని కూడా సీజేఐ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా వివిధ దేశాలకు చెందిన కెరీర్‌ జడ్జీలు, న్యాయ నిపుణులు కొంతకాలం ఇతర సభ్య దేశాల న్యాయస్థానాలను సందర్శించి అక్కడి న్యాయ విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం కల్పించవచ్చు.

భిన్న న్యాయ సంప్రదాయాలను కేవలం పుస్తకాల ద్వారా తెలుసుకోవడం కంటే.. ఆయా దేశాల న్యాయస్థానాల పని విధానం, కేసుల విచారణ పద్ధతులు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం వల్ల పరస్పర అవగాహన మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బ్రిక్స్‌ ప్లస్‌ దేశాల న్యాయ సంస్థల మధ్య వ్యక్తిగత, సంస్థాగత సంబంధాలు బలోపేతం కావచ్చని సీజేఐ ప్రతిపాదనలో అంతర్లీనంగా ఉంది.

40 శాతం ప్రపంచ ఆర్థిక శక్తికి న్యాయ భరోసా

బ్రిక్స్‌ ప్లస్‌ విస్తరణతో ఈ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలక శక్తిగా మారింది. ప్రస్తుతం 11 పూర్తి సభ్యదేశాలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి.

2024లో ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల చేరికతో బ్రిక్స్‌ విస్తరించగా.. 2025లో ఇండోనేషియా పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. దీంతో 2026లో భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సమయంలో బ్రిక్స్‌ 11 పూర్తి సభ్యదేశాల కూటమిగా కొనసాగుతోంది.

Latest