Mahaa Daily Exclusive

  సీఎం రాగానే మాట్లాడతా..! కొండా సుస్మిత వివాదంపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

Share

  •  వివాదంపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.
    త్వరలో అన్ని విషయాలూ వివరిస్తా.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుస్మిత వ్యాఖ్యలతో నెలకొన్న రాజకీయ వేడి కొనసాగుతున్న వేళ మంత్రి కొండా సురేఖ నివాసంలో జరిగిన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన మంత్రి.. ప్రస్తుతం తాను మాట్లాడాల్సిన విషయాలన్నీ ఇప్పటికే స్పష్టం చేశానని, త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తమ ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతున్నందున ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని చెప్పారు. ‘‘చెప్పాల్సిన విషయాలన్నీ నిన్ననే స్పష్టంగా చెప్పాను. ప్రస్తుతం అదనంగా చెప్పడానికి ఏమీ లేదు. త్వరలోనే అన్ని విషయాలపై పూర్తి వివరాలతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను’’ అని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌ వచ్చాకే స్పందిస్తా

మంత్రి సురేఖ అనంతరం ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై వస్తున్న విమర్శలు, ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ఎలాంటి వివరణ ఇవ్వబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అన్ని అంశాలపై మాట్లాడతానని తెలిపారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాల గురించి మాట్లాడతాను. అప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయను. త్వరలోనే అన్ని వివరాలను తప్పకుండా వెల్లడిస్తాను’’ అని సుస్మిత పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చర్చ

సుస్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రిపై సొంత పార్టీ నేతలే వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయగా, సురేఖ తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

Latest