Mahaa Daily Exclusive

  ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం ఆపేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Share

మహా: బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ప్రణాళిక చేయబడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం ఇప్పటివరకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని, ఇంకా ఏం చేయాలో ఆ దిశగా కూడా ముందుకు వెళ్తామని తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తామని, బనకచర్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుందో త్వరలోనే తెలియజేస్తామని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ హక్కులకు భంగం కలిగించేలా బనకచర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఆమోదయోగ్యం కాదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బనకచర్ల అంశాన్ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లిందని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు కలిగే సమస్యలను స్పష్టంగా వివరించామన్నారు. ఇది కేవలం నీటి పంపకం ప్రాజెక్టు కాదని, ఇది ఒక ప్రాంతానికి నీరు మళ్లించడం వల్ల మరొక రాష్ట్రంలో నీటి కేటాయింపులపై ప్రభావం చూపే ప్రతిపాదన, ప్రాజెక్టును వ్యతిరేకించడంలో మా వైఖరి స్పష్టంగా ఉందని, ప్రజల సహకారంతో అవసరమైతే ఉద్యమం కూడా తాము ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Latest