*ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేసిన పద్మశాలి సంఘం నాయకులు*
*సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించిన గుండు సుధారాణి*
హనుమకొండ, మహా;
హైదరాబాదు సచివాలయంలో అఖిలభారత, తెలంగాణ పద్మశాలి సంఘం, నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర హైన్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటరమణ , ఆర్ట్ డైరెక్టర్ గా కొండ రాజు ను నియమించినందుకు, రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలిలకు సముచిత స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాదులోని ఎల్బినగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణకు సంబంధించిన బ్రోచర్ ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పద్మశాలీల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పద్మశాలీలకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇస్తూ, పద్మశాలి సామాజిక వర్గానికి, చేనేత కార్మికులకు అండగా ఉంటామని అన్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం చేనేత కార్మికులకు సంబంధించిన 290 కోట్ల రూపాయల థ్రిప్టు ఫండ్ (పాత బకాయిలు) ను విడుదల చేసినందుకు మరియు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు బకాయి ఉన్న బతుకమ్మ చీరలకు సంబంధించిన 380 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసినందుకు పద్మశాలీ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఈరపత్రి అనిల్ కుమార్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి తోపాటు అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.








