Mahaa Daily Exclusive

  రక్తం అమ్ముకునే ఖర్మ నాకు పట్టలేదు..! అభిమానుల సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం..

Share

  • అవమానాలు వచ్చినా పట్టించుకోను.
  •  బ్లడ్ బ్యాంక్ నా కష్టార్జితంతో నడుస్తోంది.
    అభిమానుల సహకారానికి వెలకట్టలేం.
  •  అదృష్టం కాదు.. కష్టమే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది.
  • అద్దంలో చూసుకుని నన్ను నేనే
  • పొగుడుకుంటా.అభిమానుల సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం.

హైదరాబాద్, మహా.

తాజాగా అభిమానులతో జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సేవా కార్యక్రమాలపై, ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. తనకంటూ అవమానాలు ఏమీ లేవని అనుకోవద్దని, చిరంజీవి రక్తం అమ్ముకున్నాడని కొందరు చాలా తేలికగా, మూర్ఖంగా కామెంట్స్ చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల ద్వారా తనకొచ్చే రెమ్యునరేషన్ ముందు.. ఎన్ని కోట్ల బ్లడ్ ప్యాకెట్లు అమ్మితే ఆ డబ్పుతో సమానం అవుతుందో విమర్శకులు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలని ఘాటుగా స్పందించారు. బయట ఎవరి దగ్గరా చేయి చాచి విరాళాలు తీసుకోకుండా, కేవలం తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నడుపుతున్నానని, దానికి అభిమానుల నుంచి లభించే అండదండలు వెలకట్టలేనివని ఆయన స్పష్టం చేశారు. అందుకే అలాంటి చిల్లర విమర్శలను తాను ఏమాత్రం పట్టించుకోనని తేల్చి చెప్పారు.
జీవితంలో విజయం సాధించడం వెనుక అదృష్టం ఉందనే వాదనను చిరంజీవి నిర్మొహమాటంగా కొట్టిపారేశారు. అదృష్టం అనేది కొందరికే సొంతమనే వాదనను తాను నమ్మనని, కష్టాన్నే నమ్ముకోవాలని అభిమానులకు సూచించారు. సరైన సమయంలో సమయస్ఫూర్తితో (కామన్ సెన్స్) వ్యవహరించి, వచ్చిన అవకాశాలను ఆలింగనం చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటేనే అద్భుతాలు సృష్టించవచ్చని వివరించారు. నేడు ప్రపంచంలోని అత్యున్నత సంస్థలైన గూగుల్, వరల్డ్ బ్యాంక్ తదితర వాటికి సత్య నాదెళ్ల లాంటి మన భారతీయులు సీఈఓలుగా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. వాళ్లంతా ఆకాశం నుంచి ఊడిపడలేదని, మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కష్టపడి పైకొచ్చిన వారేనని, కేవలం అదృష్టవంతులకే ఉన్నత స్థానాలు దక్కుతాయనుకోవడం పొరపాటని గుర్తుచేశారు.
తన ప్రయాణాన్ని సైతం ఉదాహరణగా చెబుతూ.. తానూ ఎక్కడో మారుమూల పల్లెటూరులో, ఓ సాదాసీదా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినేనని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలోనే తన ఆశయాన్ని గుర్తించి, ఆ దిశగా అడుగులు వేస్తూ ‘నేనెందుకు సాధించకూడదు?’ అని ప్రశ్నించుకుంటూ తనపై తాను నమ్మకాన్ని పెంచుకున్నానని తెలిపారు. జీవితంలో ఎప్పుడైనా నీరసం లేదా నిరుత్సాహం ఆవహించినప్పుడు, చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అద్దం ముందుకు వెళ్లి.. ‘ఏయ్.. గ్రేట్ రా! నన్ను మించినవాడు ఎవడున్నాడురా? శభాష్!’ అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటానని తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. మనం దేన్నైతే బలంగా కోరుకుంటామో, ప్రకృతి కూడా దాన్నే పదింతలు తిరిగి ఇస్తుందని.. ఈ ‘లా ఆఫ్ అట్రాక్షన్’ సిద్ధాంతమే తనను ఎప్పుడూ ముందుకు నడిపిస్తుందని మెగాస్టార్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.

Latest