• పలుచోట్ల స్తంభించిన రాకపోకలు.
• అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
• మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం.
హైదరాబాద్, మహా.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం తీవ్రరూపం దాల్చింది. రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా అప్రమత్తం చేశారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని అధికారులు, హైదరాబాద్ విపత్తు స్పందన సంస్థ (హైడ్రా), పోలీసు శాఖలు పరస్పరం సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, మోటార్లు, డీవాటరింగ్ యంత్రాలతో నీటిని తోడేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇక నగరంలో సెప్టెంబర్ 26 వరకు ఆకాశం మేఘావృతమై మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.







