• ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 13 చోట్ల ఏకకాలంలో సోదాలు.
• ఎర్రగడ్డతో పాటు కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ ముమ్మర తనిఖీలు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హైదరాబాద్‌తో పాటు మరో మూడు జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. లక్ష్మీభాస్కర్ నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో కలిపి మొత్తం 13 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు ఉదయం నుంచే ఈ సోదాలు ప్రారంభించారు. లక్ష్మీభాస్కర్ తనకు ఉన్న చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, ఇతర కీలక ఆర్థిక లావాదేవీల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా నిమ్స్‌లో వైద్య సేవలు అందిస్తున్న ఆయన, గత ఐదేళ్లుగా డిప్యూటీ లేదా అదనపు సూపరింటెండెంట్ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ దాడుల్లో లక్ష్మీభాస్కర్‌కు చెందిన సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన ఆస్తులను గుర్తించినట్లు సామాజిక మాధ్యమాల్లో, పలు వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై ఏసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలను పూర్తిస్థాయిలో విశ్లేషించిన తర్వాతే ఆస్తుల వాస్తవ విలువపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
మరోవైపు ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లక్ష్మీభాస్కర్‌ను అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలపై కూడా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. సోదాలు ముగిసిన అనంతరం అక్రమాస్తుల లెక్కలు తేల్చి, తదుపరి చట్టపరమైన చర్యలు, అరెస్టు తదితర అంశాలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.







