కాగజ్‌నగర్ మహా : రైతులకు అత్యవసరమైన యూరియా ఎరువును సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ, సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు రైతులతో కలిసి సోమవారం పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు.ఉదయం 3 గంటల నుంచే యూరియా కోసం క్యూల్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ యూరియా అందజేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరఫరా చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. 266కు అమ్మాల్సిన యూరియా బస్తా బ్లాక్ మార్కెట్‌లో 600కు విక్రయించబడుతోందని ఇది అధికారుల నిర్లక్ష్యయన్నారు. కృత్రిమ కొరత సృష్టించి యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.కూపన్లు పొందిన రైతులకు వెంటనే యూరియా అందజేయాలని, ఇంకా కూపన్లు పొందని రైతులకు కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళన కొనసాగుతుండగా, కాగజ్‌నగర్ వ్యవసాయ అధికారి రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని, యూరియా సరఫరా పూర్తిగా చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైతులు రాస్తారోకో విరమించలేదు.దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును బలవంతంగా పోలీస్ జీపులోకి ఎక్కించారు. ఈ క్రమంలో రైతులు జీపును అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.







