మందమర్రి, మహా : గ్రామీణ మారుమూల ప్రాంతాలలో కార్మెల్ పాఠశాల సేవలు ప్రశాంశనీయం
రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేకానంద వాక్యానించారు. బుధవారం మందమర్రి మండల కేంద్రంలో కార్మల్ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఫాదర్ ఫిలిప్ లతో కలిసి హాజరై కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యం కోసం సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఉన్నత విద్యతో సమాజంలో గౌరవం పెరుగుతుందని, మనిషి దైనందిన జీవితంలో చదువు ఎంతో ఆవశ్యకమని తెలిపారు. బాల్యం నుండి నేర్చుకున్న సంస్కారం, చదువుతో భవిష్యత్తు వాటిల్లుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మందమర్రి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ప్రారంభించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. పరిశ్రమల నిర్వహణకు మానవ శక్తి అవసరమని, ఇందుకు గాను ప్రభుత్వం పారిశ్రామక శిక్షణ సంస్థ లను అభివృద్ధి చేస్తూ జిల్లాలో 4 అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తుందని తెలిపారు. టాటా సంస్థ సమన్వయంతో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇతర అధునాతన సాంకేతికత కలిగిన కోర్సులను శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
చెన్నూర్ మండలం సోమనపల్లిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరం సమిష్టిగా కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. మందమర్రి మండల కేంద్రంలో కార్మెల్ పాఠశాల సేవలు అమోఘమని ప్రశంసించారు. కార్మెల్ పాఠశాలను ప్రారంభించి 63 సంవత్సరాలు అవుతుందని వివరించారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ విదేశాలలో కూడా ఉద్యోగాలు నిర్వహించడం మామూలు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. కార్మెల్ పాఠశాలలో విద్య అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను సంస్థ అందిస్తుందని వివరించారు.







