Mahaa Daily Exclusive

  170 స‌ర్వే నంబ‌ర్ లో మ‌రో భూ భాగోతం కబ్జాకు ప్ర‌య‌త్నించిన వారిలో న‌లుగురి అరెస్ట్ ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూ క‌బ్జాకు ప్ర‌య‌త్నించిన‌ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన‌ట్టు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. మావ‌ల మండ‌ల ప‌రిధిలోని 170 స‌ర్వే నంబ‌ర్ లో ఒకరికి మంజూరైన ప్లాట్ ను త‌ప్పుడు ధృవీక‌ర‌ణ ప‌త్రాలు సృష్టించి మ‌రొక‌రి పేరుతో మార్చి ఇంకో వ్య‌క్తికి అమ్మిన కేసు గురించి బుధ‌వారం మావ‌ల పోలీస్ స్టేష‌న్ లో మీడియా స‌మావేశంలో ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించారు.ప్లాట్ ఓన‌ర్ స్వామి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే 2013 లో స్వామికి పేద‌ల‌కు భూపంపిణీలో భాగంగా అప్ప‌టి ఎమ్మార్వో 905 నంబ‌ర్ ప్లాట్ ను కేటాయించారు. 2015లో గ్రామపంచాయతీ నుండి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు. తదుపరి అనారోగ్య కారణాలవల్ల బాధితుడు ఎటువంటి భవన నిర్మాణం చేసుకోలేదు. 2021 లో ఎలాగైనా ఈ స్థలాన్ని కొట్టేయాలన్న‌ దురుద్దేశంతో నిందితులు రెహ్మాన్ ఖాన్, పవన్ నాయక్, సుంకరి సంతోష్ అనే వ్యక్తులు తహసిల్దార్ ద్వారా తమకు కేటాయించినట్లు నకిలీ పత్రాలను సృష్టించి, అసలైన యజమానిని స్థలంలోకి రానివ్వకుండా సుంకరి వంశీకృష్ణ సహాయంతో బెదిరింపులకు పాల్పడిన‌ట్టు తెలిపారు. పవన్ నాయక్, రెహమాన్ ఖాన్ అనే వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిసినా సుంకరి సంతోష్ త‌న‌ భార్య సుంకరి వెంకటమ్మ పేరిట 2021లో రెండున్నర లక్షల రూపాయలకు కొన్న‌ట్టు తెలిపారు.అనంత‌రం తాటి లక్ష్మణ్ అనే వ్యక్తి హౌస్ నంబర్లు కరెంట్ బిల్లు రావడంలో డబ్బులు తీసుకొని సహాయం చేసినట్టు తేలింద‌న్నారు. అదే ప్లాట్ ను సుంకరి వెంకటమ్మ సుంకరి సంతోష్ లు అధిక ధరలకు కిష్టన్న అనే వ్యక్తికి అమ్మిన‌ట్టు వివ‌రించారు. నిందితులు పక్కా పథకం ప్రకారం కబ్జా చేయాలనే దురుద్దేశంతో నకిలీ పత్రాలను సృష్టించి ఆ నకిలీ పత్రాల సహాయంతో ప్లాటును విక్రయించి బాధితునికి అన్యాయం చేసిన‌ట్టు తెలిపారు. ఈ కేసులో ర‌హ‌మాన్ ఖాన్ , సుంకరి సంతోష్ ,తాటి లక్ష్మణ్ ,సుంకరి వంశీకృష్ణ ల‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించిన‌ల్లు తెలిపారు. మిగ‌తా వారు ప‌రారీలో ఉన్న‌ట్టు తెలిపారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest