మణుగూరు, మహా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి అధికారుల క్వార్టర్స్‌లో అత్యంత విషపూరితమైన పాము కనిపించి భయాందోళన కలిగించింది. అధికారి వీరభద్రం నివాస క్వార్టర్ వద్ద నలుపు, పసుపు గీతలతో ఉన్న పొడవాటి పాము కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ముజఫర్ అక్కడికి చేరుకొని దాదాపు మూడు గంటల పాటు శ్రమించి పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఇది “బ్యాండెడ్ క్రైట్” అనే అత్యంత విషపూరిత జాతికి చెందిన పాము.
ఈ పాము ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తుంది. పగటి వేళ మట్టిలో, రాళ్ల కింద దాక్కుంటుంది. ఇది ప్రధానంగా ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపించేదే. దీని కాటు నర్వ్ సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపించి శ్వాస ఆడకుండా చేసి, గుండె స్పందన తగ్గిస్తుంది. అంతేగాక పాక్షిక వాతం, మరణం వచ్చే అవకాశమూ ఉందని ముజఫర్ వివరించారు.
ఇలాంటి పాములు నివాస ప్రాంతాల్లోకి రావడం చాలా ప్రమాదకరం. అవి కనిపించినప్పుడు తాము పట్టేందుకు ప్రయత్నించకుండా వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు







