Mahaa Daily Exclusive

  సన్నబియ్యమూ పక్కదారి.. -జిల్లాలో బరితెగిస్తున్న అక్రమార్కులు -వివిధ బ్రాండ్ల పేరిట అధిక ధరలకు అమ్మకాలు -విక్రయించిన వారి రేషన్ కార్డులు రద్దు….!

Share

ఆదిలాబాద్, మహా

ఇన్నాళ్లు దొడ్డు బియ్యాన్ని పక్కదారి పట్టించిన అక్రమార్కులు తాజాగా సన్నబియ్యాన్ని కూడా వదలడం లేదు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ సన్న బియ్యాన్ని ఆకర్షణీయమైన సంచుల్లో నింపి వివిధ బ్రాండ్ల పేరిట బహిరంగ విపణిలో విక్రయిస్తుండటం చర్చనీయాంశమైంది. పోలీసులు, పౌరసరఫరాలశాఖ టస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో 79.30క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. రేషన్ లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేరిట అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. జిల్లాలో ఇది వరకు దొడ్డు బియ్యం అనేక సార్లు పట్టుబడగా.. తాజాగా సన్నబియ్యం కూడా పక్కదారి పడుతుండటంతో అటు అధికార యంత్రాంగం..ఇటు ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. సన్నబియ్యం పక్కదారి పట్టించిన అక్రమార్కుల్లో మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. పోలీసు, పౌరసరఫరాలశాఖ యంత్రాంగం ఈ పరిణామాలపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపడుతున్న పోలీసులు ఈ బియ్యం విక్రయించిన వారి వివరాలను సైతం రాబడుతున్నారు.

బ్రాండ్ల పేరుతో ..ఆకర్షణీయంగా మార్చి

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డులు కలిగిన నిరుపేదలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుడికి 6కిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ ప్రతి నెలా ఈ బియ్యం ఉచితంగా అందజేస్తోంది. ఇది వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇది వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అనేక మంది రేషన్ లబ్ధిదారులు వాటిని తినకుండా కిలోకు రూ.10చొప్పున మద్య దళారులకు విక్రయించేవారు. కొందరు రేషన్ డీలర్లకే అమ్మేవారు. దీంతో కొందరు బియ్యం వ్యాపారులు లబ్ధిదారులతో పాటు డీలర్ల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఒక దగ్గర పెద్ద ఎత్తున పోగు చేసి లారీల ద్వారా మహారాష్ట్ర ప్రాంతానికి తరలించేవారు. ఇలా తరలించే క్రమంలో అనేక సార్లు అక్రమార్కులు పట్టుబడటం.. అధికారులు వారిపై 6ఏ కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఇది వరకు 278 కేసులు నమోదు చేసి సుమారు 2వేల మెట్రిక్ టన్నుల వరకు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బియ్యం అక్రమార్కులు పలుమార్లు పట్టుబడినా మళ్ళీ ఇదే దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. తాజాగా జిల్లా పోలీసు యంత్రాంగం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో పీడీఎస్ బియ్యం అక్రమాలపైనా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో అనేక మంది లబ్ధిదారులు ఈ బియ్యాన్నితింటున్నారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేయడం చాలా వరకు తగ్గిపోయింది. కానీ కొందరు లబ్ధిదారులు మాత్రం కిలోకు రూ.15 చొప్పున విక్రయిస్తుండటంతో మళ్లీ బియ్యం దందాకు తెరలేపిందనే చర్చ మొదలైంది. ఈ బియ్యం కొనుగోలు చేసిన దళారులు వివిధ రైస్ బ్రాండ్ల పేరిట ఆకర్షణీయమైన సంచుల్లో నింపి బహిరంగ విపణిలో విక్రయిస్తున్నారు. ఇద్దరిని పట్టుకొని అరెస్టు చేయడంతో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రేషన్ కార్డులు రద్దు..?

ప్రభుత్వం పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా పంపిణీ చేస్తుంటే..కొందరు మాత్రం ఈ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం..ఉన్నతాధికారులు ఈ బియ్యం విక్రయించిన లబ్ధిదారుల వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన నిందితుల నుంచి వివరాలు సేకరించి బియ్యం విక్రయించింది ఎవరనే విషయమై తెలుసుకోనున్నారు. లబ్ధిదారుల వివరాలు వెల్లడైన తర్వాత వారి రేషన్ కార్డులు పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొందరివి రద్దు చేస్తేనే మిగితా వారు భయపడి ఈ బియ్యం విక్రయించకుండా ఉంటారని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాం.
వాజిద్ అలీ, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, ఆదిలాబాద్

ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే దళారులకు అమ్ముకోవడం సరికాదు. జిల్లాలో సన్నబియ్యం అక్రమాలపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం పట్టుబడిన బియ్యాన్ని గోదాముకు తరలిస్తాం. పౌరసరఫరాలశాఖ ద్వారా నిరంతరం తనిఖీలు చేపడుతాం. పట్టుబడిన బియ్యం ఘటనపై విచారణ జరుగుతోంది. అక్రమంగా తరలించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Latest