మంచిర్యాల, మహా :
ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన గోమాస బింగమ్మ, గోమాస భాగ్యలక్ష్మి, గోమాస ధనలక్ష్మి, దుర్గం సౌందర్య తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ప్రతినిధులు తమ దరఖాస్తులో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎలాంటి షరతులు లేకుండా లబ్దిదారులకు నిధులు మంజూరు చేయాలని, బడ్జెట్లో ఈ పథకం కొరకు నిధులు పెంచాలని కోరారు. అంతేకాకుండా ఇందులో రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులందరికీ పథకం వర్తింపచేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. లక్షెట్టిపేట మండలం పాతకొమ్ముగూడెం గ్రామానికి చెందిన శంకరి సత్యం తనకు ఇంటి స్థలం ఉందని, ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపచేసి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామం ఎస్.సి. కాలనీవాసులు తమ ప్రాంతంలో ఒక అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండల కేంద్రానికి చెందిన చిత్తారి కిరణ్ కుమార్ హాజీపూర్ మండలం గుడిపేటలో గల కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల సౌకర్యార్థం క్యాతనపల్లి వరకు నడుస్తున్న ఆర్.టి.సి. బస్సును మందమర్రి వరకు నడిపించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండల కేంద్రానికి చెందిన గంగవరపు శ్రీహరి తాను కోటపల్లి మండలంలోని లింగన్నపేట, రాజారాం గ్రామాలలో మహిళ భవనములను నిర్మించాలని, సంబంధిత బిల్లులు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండల కేంద్రానికి చెందిన అంకం సాగర్ సివిల్ కాంట్రాక్టర్ అయిన తాను హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో స్లాబ్ కల్వర్టు పని పూర్తి చేశానని, బిల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండల కేంద్రానికి చెందిన పిట్ట సుశీల ఒంటరి మహిళ అయిన తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణం కమ్మరివాడకు చెందిన సుబ్రహ్మణ్యం తాను 3 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాను అని, తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన దేవి లక్ష్మి నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో 49 దరఖాస్తులు అందాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







