Mahaa Daily Exclusive

  పనుల్లో వేగం పెంచాలి మంచి రోడ్లు ఉంటే రవాణా సౌకర్యం పెరుగుతుంది మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ..!

Share

హైదరాబాద్, మహా : ఆర్ అండ్ బి శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సెక్రటేరియట్ లో ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రోడ్లు భవనాలు శాఖపై బృహత్తర బాధ్యత ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా పూర్తయి వాడుకలోకి వచ్చేవాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ అధికారులకు ఈ సందర్భంగా ఆదేశించారు.

పెండింగ్ లో ఉన్న 5 జిల్లా సమీకృత కార్యాలయాలు

ఆదిలాబాద్, వరంగల్, ములుగు, నారాయణపేట, కరీంనగర్ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీయగా పెండింగ్ బిల్లుల అంశం అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్క్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న వరంగల్, ములుగు జిల్లా కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు. ఆర్వోబిల నిర్మాణం పై ఆరా తీసిన మంత్రి నిజామాబాద్ మాధవనగర్ ఆర్వోబి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. నిర్మాణం చివరి దశలో ఉన్న ఆర్వోబీలు,మెడికల్ కాలేజీలు, టిమ్స్ హాస్పిటల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మంచి రోడ్లు ఉంటే రవాణా సౌకర్యం పెరుగుతుంది..అది అభివృద్ధికి సూచిక అవుతుందన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో 91లక్షల వెహికిల్ మూమెంట్ ఉందని, రూరల్ తెలంగాణ లో అదే స్థాయిలో ఉంటుందని అందుకు మంచి రోడ్లు ఉండాలని,ప్రజలకు ప్రధానంగా కావాల్సింది సౌకర్యవంతమైన రోడ్లనీ గుర్తెరిగి పనిచేయాలన్నారు. వర్క్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో మాట్లాడి క్లియర్ చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్సీ తిరుమల,చీఫ్ ఇంజనీర్లు మోహన్ నాయక్,రాజేశ్వర్ రెడ్డి,లక్ష్మణ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Latest