భూపాలపల్లి, మహా :
ఆరోగ్యకర జీవనయానానికి యోగ ఎంతో ఉపయోగకరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడిఓసి కార్యాలయంలో వైద్య, ఆయుష్షు శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగా ఆసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం “యోగా ఫర్ వన్ ఎర్త్ … వన్ హెల్త్” థీమ్ చేపట్టి నట్లు తెలిపారు. శరీరాన్ని యోగా ద్వారా శుద్ధి చేసి, మంచిని ఆచరిస్తూ, మంచి ఆలోచనలతో అమూల్యమైన ఫలితాలను సాధించేందుకు దివ్యమైన ఆయుధంగా యోగా ఉపయోగపడుతుందని అన్నారు. యోగా సాధన ద్వారా మనస్సు అలజడి లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందని, తద్వారా వచ్చే ఆలోచనలతో మరింత ప్రభావవంతంగా ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. యోగా అనేది వ్యాయామం కాదని ,ఇది శరీరానికి ఆరోగ్యానికి, మనసుకు ప్రశాంతతను ఇచ్చే గొప్ప మార్గమని అన్నారు. నిత్యం యోగా సాధన మానసిక వత్తిడిని జయించడానికి అవకాశం ఉంటుందని యోగా చేయడం దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరకంగా బలంగా, మానసికంగా నిలకడగా శక్తి వంతంగా ఉంటామని అన్నారు. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేసేందుకు సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు.
మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉంటుందని,
విధుల నిర్వహణలో అంకితభావం అలవడుతుందిని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఆయుష్షు వైద్యులు డా తనూజా రాణి, డిపిఓ వీర భద్రయ్య, డిఎస్పీ సంపత్ రావు, ఈడిఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.







