ఆదిలాబాద్, మహా
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలని విప్లవోద్యమంలోకి అడుగుపెట్టి పోరాటాలు చేసిన చేగువేరాను స్పూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేగువేరా 97 వ జయంతిని శనివారం స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ మెడిసిన్ చదివి వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత సమాజంలోని అసమానతలు, దోపిడీ దౌర్జన్యాలను చూసి చేగువేరా చలించిపోయాడని గుర్తుచేశారు. మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను తుదమట్టించాలన్న లక్ష్యంతో క్యూబా విప్లవ పోరాటానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను చూసి ఇప్పటికీ యువత స్ఫూర్తి పొందుతారని అన్నారు. చేగువేరా నమ్మిన సోషలిజం సాధించడంతోనే ప్రజల ఇబ్బందులు దూరమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, బొజ్జ ఆశన్న, సురేందర్, అగ్గిమళ్ళ స్వామి తదితరులు పాల్గొన్నారు.







