కాటారం, మహా : కడుపునొప్పితో బాధపడుతూ వచ్చిన ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన రాళ్ల బండి నాగరాజు (23) అనే యువకుడు మహాదేపూర్ సామాజిక వైద్యశాలలో చికిత్స పొందుతూ వైద్యం వికటించడంతో మరణించాడు. కడుపులో మంట తో బాధపడుతున్న నాగరాజు తన తల్లిని వెంట తీసుకొని ద్విచక్ర వాహనంపై మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలను చేరుకున్నాడు. ఓపీలో పరీక్ష నిర్వహించిన అనంతరం ఆసుపత్రిలో చేరిన నాగరాజుకు వైద్యం ప్రారంభించిన క్షణాలలోనే పరిస్థితి చేయి దాటడంతో వైద్యులు అంబులెన్స్ ను రప్పించి వెంటనే జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. మహాదేవపూర్ ఆస్పత్రిలో రెండవ ఇంజక్షన్ ఇస్తున్న క్రమంలో ‘అమ్మ’ అని వెంటనే తన కొడుకు మృతి చెందాడని రాళ్లబండి సత్తయ్య ఆరోపిస్తున్నారు. ఆక్సిజను, సెలైన్ ఎక్కించిన వైద్యులు అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. కాటారం దాటిన తర్వాత మార్గమధ్యంలోనే నాగరాజు ప్రాణం పోయిందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.100 పడకల ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు నాగరాజు మృతి చెందినట్లు వెల్లడించారు. వైద్యం వికటించడం మూలంగానే తన కుమారుడు చనిపోయాడని నాగరాజు తల్లిదండ్రులు రాళ్ల బండి సత్తయ్య, సరోజనలు బంధువులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే ఉన్నతాధికారులతో విచారించి, బాధ్యులను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం కల్పించాలని డివైఎఫ్ఐ అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న నాగరాజు రెండు మూడు రోజులుగా విరోచనాలు అవుతున్నాయని కడుపులో మంటగా ఉందని తెలిపినట్లు నాగరాజును పరీక్షించిన డాక్టర్ మాధవి అన్నారు.. అందుకు సంబంధించి వైద్యం ప్రారంభించగానే వాంతి చేసుకునే క్రమంలో ఫిట్స్ వచ్చినట్లు పరీక్షించిన డాక్టర్ తెలిపారు. వెంటనే పరిస్థితిని గమనించి ఆక్సిజన్ అందజేయడంతో పాటు, తగిన జాగ్రత్తలతో అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆసుపత్రి సూపర్డెంట్ విద్యావతి కూడా పరిస్థితి గమనించి తరలించే ఏర్పాట్లు చేశారు. అతనికి ఇంకేమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో లేదో తమకు తెలియదన్నారు. కాటారం దాటేవరకు పల్స్ ఉందని, సెలైన్ ఎక్కుతున్న విషయాన్ని కూడా వారి తల్లికి చూపించి ఆందోళన చెందవద్దని కోరినట్లు వార్డు బాయ్ తెలిపారు. ఒకవైపు డాక్టర్ల వివరణ ఇలా ఉండగా, వైద్యం వికటించిన కారణంగానే తమ కుమారుడు మరణించాడని సత్తయ్య, సరోజనలు ఫిర్యాదు చేస్తున్నారు. పరిస్థితి ఏమిటో ఉన్నతాధికారులు వివరిస్తే తప్ప తెలియని పరిస్థితి.







