Mahaa Daily Exclusive

  ఈటల చెప్పినవి అసత్యాలే =కమిషన్‌కు ఇచ్చిన వాగ్మూలం అసత్యం అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఈ ఇష్యూలోకి నన్నెందుకు లాగుతున్నారని మంత్రి ఫైర్..!

Share

కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారన్నారు. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఎంపీ ఈటల ప్రస్తావించిన సబ్‌ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని, మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిటీ వేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు, సబ్‌ కమిటీకి సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై మాత్రమే సబ్‌ కమిటీ వేశారు. తాను సుమోటోగా కమిషనర్‌ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని, సబ్‌ కమిటీ నిర్ణయాలను కమిషన్‌ ముందు ఉంచుతానని తుమ్మల తెలిపారు. చాలా రోజులు అయింది కాబట్టి అనాలోచితంగా ఇచ్చారో తెలీదన్నారు. ‘కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని, పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏర్పాటు కోసం వేసిన సబ్ కమిటీ కాదు. మేడిగడ్డ, ప్రాణహిత, కడ్కో పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ లేదు.. రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కమిటీకి.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం పొందినట్లు ఈటల రాజేందర్ చెప్పారు.. అది వాస్తవం కాదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నిర్మాణం కోసం క్యాబినెట్ ఆమోదానికి ఎప్పుడూ రాలేదు అని తేల్చి చెప్పారు.
వాంగ్మూలం చాలా బాధాకరం..
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మాత్రమే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈటల చెప్పిన విషయాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్లాయి.. అలా తప్పుడు సంకేతాలు వెళ్ళొద్దనే నేను మీ ముందుకు వచ్చాను.. ఆ తప్పును ఈటల ఎందుకు తన భుజాల మీదకు వేసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈటలకు తప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. 43 ఏళ్లుగా పద్ధతితో, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఈటల రాజేందర్‌కు తెలుసు. ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్‌ చూశాక కొంత బాధేసింది. ఈటల రాజేందర్ ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలీదు. సబ్ కమిటీ రిపోర్ట్‌ను కమిషన్‌కు ఇస్తాను. నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదు. ఈటల రాజేందర్ వాంగ్మూలం చాలా బాధాకరం’’ అని తుమ్మల వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల చెప్పిన సమాధానాలు చూసి బాధ, అనుమానం వ్యక్తమయ్యాయి.. నేనే సుమోటోగా కాళేశ్వరం కమిషన్‌కు సబ్ కమిటీ రిపోర్టు, ఇతర వివరాలు అందిద్దామని అనుకుంటున్నాను.. కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇంకా హరీశ్ అబద్ధాలు ఆడాలని చూస్తే.. అబద్ధాల హరీశ్ అవుతాడు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయం క్యాబినెట్ ముందుకు వచ్చినట్లు ఏదైనా ఆధారాలు ఉంటే చూపండి అని మంత్రి తుమ్మల సవాల్ విసిరారు.

Latest