మహా: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ప్రభుత్వం తరఫున ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం కొరకు ముఖాముఖి కార్యక్రమం పున: ప్రారంభించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ముఖాముఖి కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను, సూచనలు అభిప్రాయాలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. భూ పంచాయతీలు, సీనియర్ సిటిజన్ ఇష్యూస్, ఉద్యోగ అవకాశాలు, పార్టీలో పదవులు తదితర సమస్యలపై సావధానంగా వింటూ వినతి పత్రాలు స్వీకరించానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్రజా భవన్‌లో ప్రజా సమస్యలకు సంబంధించి విజ్ఞప్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. పార్టీకి గాంధీ భవన్ దేవాలయం లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన దేవాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
టీ కప్పులో తుఫాను..
కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు గాంధీ భవన్‌కి వచ్చి సమస్యలు తెలుపుకోవాలి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పొన్నం సూచించారు. న భూతో న భవిష్యత్తు తరహాలో కాంగ్రెస్ పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో హనుమంతుడి గుడి లేని ఊరు ఎలా ఉండదో అలానే.. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలు పిల్లి శాపనార్థాలు పెట్టడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివని వ్యాఖ్యానించారు. ఉనికి కోసం గులాబీ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయంగా దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని కామెంట్స్ చేశారు. సీ.పీ ఘోష్ కమిషన్ కి విచారణకు ఎవరినైనా పిలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు జారీ చేసిన నోటీసులపై స్పందించారు. కేసీఆర్ నీళ్ల లాగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తున్నారని, వార్తల కోసమే లేఖలు రాసారని దుయ్యబట్టారు. కవిత అంశం టీ కప్పులో తుఫాను లాంటివని ఎద్దేవా చేశారు. కేటీఆర్, కవిత పంచాయతీ కాంగ్రెస్‌కు అవసరం లేదని వెల్లడించారు. ఎవరిని పిలవాలనేది కమీషన్ ఇష్టమని, నీళ్లు ఇస్తే సంతోషమే.. కానీ నీళ్లలా తెలంగాణ ధనాన్ని ధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసారని, సత్వర సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.







