Mahaa Daily Exclusive

  టీడీపీ సారథిగా మళ్లీ బాబే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటన..!

Share

మహా: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఈ మేరకు టీడీపీ నాయకులంతా ఆయనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో చంద్రబాబు తొలిసారి టీడీపీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. మహానాడు రెండో రోజున పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి చంద్రబాబు నామినేషన్లను పలువురు నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు పార్టీ నేతలంతా మద్ధతు తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య మహానాడు వేదికపై ప్రకటించారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక.. కడపతో కలుపుకుని ఇప్పటివరకు 25 మహానాడులు నిర్వహించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుతో వర్ల రామయ్య ప్రమాణం చేయించారు.
40 ఏళ్లకు ప్రణాళిక..
మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని, తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలం, బలగం టీడీపీ.. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని మరింత సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయని, పార్టీ తరపున రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నామని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశామని గుర్తు చేశారు. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన టీడీపీ.. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచిందని చెప్పారు. రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమగా మారుస్తానని చెప్పామన్నారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ కారణమని వెల్లడించారు. 2027 నాటికి పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. హంద్రీనీవా కింద చివరి భూములకు నీళ్ల కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం తర్వాత హంద్రీనీవాకు భారీగా ఖర్చు చేస్తున్నామని, వెలిగొండతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Latest