మహా: కాళేశ్వరం కమిషన్ విచారణపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జూన్ 5వ తేదీన పీసీ ఘోష్ విచారణ కమిషన్ ముందు హజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంగళవారం తనతో భేటీ అయిన పార్టీలోని కొందరు సీనియర్ నేతలతో ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలపై రేవంత్ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నియమించింది. ఆరోపణలపై కమిషన్ గడచిన ఏడాదిలో 110 మందిని విచారించిన తర్వాత కేసీఆర్‌తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరశ్ రావుకు కూడా నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కమిషన్ ముందు విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది. విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న విషయం ఇన్నిరోజులు సస్పెన్స్ గా ఉండిపోయింది. అలాంటిది తనను కలసిన నేతలతో మాట్లాడినపుడు విచారణకు హాజరవుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. దాంతో కేసీఆర్ తర్వాత 6వ తేదీన హరీశ్ రావు కూడా విచారణకు హాజరవ్వటం ఖాయమైపోయింది.
ఏడుసార్లు పొడిగింపు
తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై గత కొన్ని నెలల నుంచి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. గతేడాది మార్చి 13న రేవంత్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన ఇప్పటికి 14 నెలలు పూర్తి కావచ్చింది. ఏడుసార్లు కమిషన్ గడువు పొడిగించింది ప్రభుత్వం. కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు మే 20న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ జూన్ ఐదులోగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించింది.
అన్ని అంశాలపై ఆరా..
అటు బీఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు యూకే, అమెరికా పర్యటనకు వెళ్లారు. వచ్చే 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఆలోగా తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. కేసీఆర్ విచారణకు హాజరైనా? లేకపోయినా అందుబాటులో ఉండేందుకు వీలుగా కేటీఆర్ నాలుగో తేదీన హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నేతలు చెప్తున్నారు. విశ్రాంత ఇంజినీర్లు, న్యాయవాదులతో సమావేశమవుతున్న కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన అన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అఫిడవిట్లు, నివేదికలు, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేస్తున్నందున అందులోని అంశాలు క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా అడుగుతున్న ప్రశ్నల గురించి దృష్టి సారించినట్లు తెలిసింది.







