వరంగల్ మహా;
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర చాలా కీలకమైనదని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
మంగళవారం వరంగల్ దేశాయిపేట లోని సి కె ఎం కళాశాలలో లైసెన్స్ సర్వేయర్‌లకు సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్‌లను నియమించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి, వారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలో 315 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్‌లకు సోమవారం నుంచి 50 రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారికి అనుభజ్ఞులైన రిటైర్డ్ సర్వేయర్లు థియరీతో పాటు ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణులైన వారినే సర్వేయర్లుగా నియమిస్తామన్నారు. ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించిన సర్వే ఎఫ్ లైన్ వంటి సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకించి రెవెన్యూకు చెందిన గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారం కోసం నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని లైసెన్స్‌డ్ సర్వేయర్‌లు చేసిన భూ సర్వేను ప్రభుత్వ సర్వేయర్‌లు పరిశీలన చేసి, మ్యాప్ రూపొందిస్తారని కలెక్టర్ అన్నారు. భూ భారతి చట్టం అమలు కోసం ఎంపిక చేసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అభ్యర్థులకు
శిక్షణ మెటీరియల్ కిట్‌ను అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, పర్యవేక్షకులు అబూతల్హా, డిప్యూటీ సర్వేయర్ ప్రభాకర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







