వరంగల్ మహా;
వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో యాసంగి ధాన్యం సేకరణపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ల తో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల గురించి కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. జిల్లాలో 182 ధాన్యం కొనుగోలు సెంటర్ల లో 2024- 25 రబీ సీజనుకు గాను జిల్లా నుండి రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అంచనా వేయగా ఇప్పటివరకు దాదాపు 87 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అన్ని ఏర్పాట్లు చేశామని, నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సారి రాష్ట్రంలో యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు అయ్యిందని అన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణను ఓ మహా యజ్ఞంలా భావిస్తూ, రైతుల నుండి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. సన్నలకు బోనస్ సైతం చెల్లించడం
జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 60.14 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను సేకరించడం జరిగిందన్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో పోలిస్తే ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో ధాన్యం సేకరణ జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పర్యవేక్షణ జరపాలని, నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ మంజూరీలు తెలుపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్ కార్డులు జారీ కాకుండా పకడ్బందీ పరిశీలన జరపాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా నుండి డిసిఓ నీరజ, డిఏఓ అనురాధ, డీఆర్డీఓ కౌసల్య దేవి, డి ఎం సివిల్ సప్లై సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.







