కాటారం, మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో 353 జాతీయ రహదారిపై చింతకాని క్రాస్ రోడ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మండలంలోని ధన్వాడ గ్రామానికి చెందిన తుల్సెగారి రాజలింగు వివాహానికి హాజరై మోటారు సైకిల్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో చింతకానిక్ క్రాస్ రోడ్ వద్ద పోలీస్ శాఖ ఏర్పాటుచేసిన బారికేడ్లు వద్ద వరంగల్ వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీ కొనడంతో బైక్ పై నుండి రాజలింగు రోడ్డుపై కింద పడి అక్కడికక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నారు. కాటారం సబ్ ఇన్స్పెక్టర్ మ్యాకల అభినవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అడ్డు అదుపులేని ఇసుక లారీల రవాణాతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







