Mahaa Daily Exclusive

  ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యూడీషియల్ కమీషన్ వేయాలి – మాజీ మంత్రి కేటీఆర్

Share

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యూడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల అనుమతి తీసుకోకుండానే టన్నెల్ పనులు ప్రారంభించారన్న వార్తల నేపథ్యంలో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, అనుభవరాహిత్యమే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. ఈ దుర్ఘటనలో చిక్కుకుని ఎనిమిది మంది కార్మికులు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హెలికాప్టర్లలో ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారని విమర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించే తీరిక ముఖ్యమంత్రి లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో మూడు భారీ ప్రమాదాలు జరిగాయని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఖమ్మంలో పెద్దవాగు పూర్తిగా కొట్టుకుపోయిందని, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోయి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు.

తాజాగా, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) పనుల్లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకున్నారని, 72 గంటలు గడిచినా ఇంకా వారిని బయటకు తీసుకురాలేకపోయారని వస్తున్న వార్తలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా రాజకీయ లబ్ధి కోసం “లక్షల కోట్ల అవినీతి, వేల కోట్ల అవినీతి” అంటూ నానా యాగీ చేసిన కాంగ్రెస్ నాయకులు, కొంతమంది మేధావులు ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల అనుమతి తీసుకోకుండా, ఆ సంస్థ ఇంజనీర్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే టన్నెల్ పనులు ప్రారంభించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్న కేటీఆర్, నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ జ్యూడీషియల్ కమీషన్ తో విచారణ జరిపి సుంకిశాల రిటైనింగ్ వాల్ ఎందుకు కూలింది? ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ ప్రమాదానికి కారణాలను రాష్ట్ర ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలను వేగవంతంగా చేపడుతూనే, ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, ఇతర సంస్థల సహకారంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించేందుకు ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు.

Latest