దానం ఎన్నిక రద్దయితే.
* ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా నన్నే ప్రకటించాలి: విజయారెడ్డి.
హైదరాబాద్, మహా.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక వ్యవహారం మరోసారి న్యాయపరమైన మలుపు తిరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నిర్వహించకూడదని కాంగ్రెస్ నేత విజయారెడ్డి కోరారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తేల్చిన పక్షంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల పిటిషన్‌పై నమ్మకం
శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన విజయారెడ్డి.. దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. తన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని తేలితే, తనను విజేతగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఉపఎన్నికకు ముందే తీర్పు ఇవ్వాలి
ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక నిర్వహించడం సరికాదని విజయారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఆమె తెలిపారు. తన పిటిషన్‌ను పక్కనపెట్టి ఉపఎన్నిక నిర్వహించే ప్రయత్నం జరిగితే, దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై మరోసారి కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఉపఎన్నిక జరిగే పరిస్థితి వస్తే ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుందని విజయారెడ్డి అన్నారు.








