- ఫ్లై దుబాయ్ విమాన ఘటన
- పైలట్ స్మిత్ మచ్చర్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ
- మోదీ వీడియో కాల్ ద్వారా సంభాషణ
- ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్
- అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రధాని
మహా : ఫ్లై దుబాయ్ విమానంలో తీవ్ర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని, వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత సంతతి పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాల్ లో మాట్లాడారు. క్లిష్ట సమయంలో స్మిత్ చూపిన ధైర్యసాహసాలను ప్రధాని మోదీ అభినందించారు. అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతోనూ ప్రధాని మాట్లాడి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎవరి ప్రాణం పోవొద్దనే ప్రార్థించా – స్మిత్
ప్రధాని నుంచి ఫోన్ కాల్ రావడంతో స్మిత్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని అంటే తనకు అత్యంత గౌరవమని, ఆయన నుంచి కాల్ రావడం చాలా ప్రత్యేకంగా, గర్వంగా ఉందన్నారు. ఇది తాను కలలో కూడా ఊహించని క్షణమన్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తాను హనుమాన్ చాలీసాను పఠిస్తానన్నారు. కాక్‌పిట్‌లో ఘర్షణ సమయంలోనూ ఆ మంత్రాన్నే జపించానని చెప్పారు. ఆ సమయంలో తాను గాయపడినా దాని గురించి ఆలోచించలేదని, ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానని ప్రధానికి స్మిత్ తెలిపారు. అంతకుముందు స్మిత్ కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయనకు అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని మోదీ స్మిత్ కుటుంబానికి హామీ ఇచ్చారు. స్మిత్ మచ్చర్ యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.







