Mahaa Daily Exclusive

  స్మిత్ మచ్చర్.. ఇండియన్ హీరో..

Share

  • స్మిత్ మచ్చర్.. ఇండియన్ హీరో
  • పైలట్ మచ్చర్ సాహసానికి దేశం జేజేలు
  • 180 మందిని కాపాడిన భారతీయ పైలట్

 

(మహా ప్రత్యేకం)

ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడిని ధైర్యంగా తిప్పికొట్టి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత సంతతి పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ పై ప్రశంసల జల్లు కురుప్తోంది. దేశమంతా జేజేలు పలుకుతోంది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని భయాందోళన.. తోటి కో-పైలటే విమానాన్ని కూల్చివేసేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు.. తీవ్రంగా గాయపడి, శరీరం నుంచి రక్తం కారుతున్నా సరే.. అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి 180 మంది ప్రాణాలను కాపాడారు భారతీయ పైలట్ముం. బైకి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ చూపిన అసమాన ధైర్యం, తెగువ వల్ల ప్రపంచం మరో 9/11 తరహా విషాదం నుంచి తప్పించుకుంది. తన సమయస్ఫూర్తితో విమానంలోని 180 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లైదుబాయ్ దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో కాక్‌పిట్ లోపల జరిగిన ఈ అనూహ్య పరిణామంలో, ఒమన్‌కు చెందిన కో-పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి యత్నించగా, భారత సంతతికి చెందిన పైలట్-ఇన్-కమాండ్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తితో ఘోర ప్రమాదాన్ని తప్పించాడు.

 

ఆకాశంలో భయానక క్షణాలు

 

విమానం గాల్లో ఉన్న సమయంలో పైలట్లలో ఒకరు మరో పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించారు. ఈ సమయంలో కాక్‌పిట్‌లో రక్తం కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో విమానం 33,000 అడుగుల నుంచి 17,000 అడుగులకు, దాదాపు 14,000 అడుగుల మేర ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

 

ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్ఛర్

 

ఈ ప్రమాదకర పరిస్థితిలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తితో కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశారు. దీంతో తోటి ప్రయాణికులు, విధుల్లో లేని మరో ఇద్దరు పైలట్ల సహాయంతో, దాడికి పాల్పడిన వ్యక్తిని తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడేలా చేసి, సౌదీ అరేబియాలోని తబూక్‌‌లో విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో విమానం చివరి భాగం స్వల్పంగా దెబ్బతింది.

 

ఉగ్రవాద కోణంలో దర్యాప్తు

గగనతలంలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధికారులు దీన్ని ఒక ఉగ్రవాద చర్యగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సాహసోపేతమైన చర్యతో వందలాది మంది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మచ్ఛర్ ను ప్రసంశించారు.

 

స్మిత్ మచ్ఛర్ ఎవరు?

 

స్మిత్ మచ్ఛర్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన జూన్ 2022 నుంచి ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానాల్లో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. 737-800, 737 మాక్స్ 8.. 9లో 9,750 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు, ఆయన ముంబైలోని స్పైస్‌జెట్‌లో 11 సంవత్సరాలు పనిచేశారు. ఆయన సీనియర్ కమాండర్‌గా కూడా పనిచేశారు, ఆ తర్వాత నవంబర్ 2020లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్ అయ్యారు. ఈ హోదాలో ఆయన ఇతర పైలట్‌లకు శిక్షణ ఇచ్చారు. మచ్ఛర్ ముంబైలోని ఘట్‌కోపర్ ఈస్ట్‌కు చెందినవాడని, ఉద్యోగ కోసం దుబాయ్‌లో నివసిస్తున్నారని తెలుస్తోంది. అతను ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా చేరినట్లు కూడా ఆ ప్రొఫైల్ చూపిస్తుంది. దీనివల్ల, ఇప్పటికే మరో విమానయాన సంస్థలో కెప్టెన్ పదవుల్లో ఉన్న పైలట్లను నియమించుకుని, వారిని నేరుగా కెప్టెన్‌లుగా నియమించే అవకాశం విమానయాన సంస్థలకు ఉంటుంది. స్పైస్‌జెట్‌లో పైలట్-ఇన్-కమాండ్‌గా అతనికి 6,400 గంటలకు పైగా అనుభవం ఉందని కూడా అందులో పేర్కొన్నారు. మచ్ఛర్ జూన్ 2007 నుంచి ఏప్రిల్ 2008 మధ్య వెలింకార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. మచ్ఛర్ సోదరుడు కూడా అకాసా ఎయిర్‌లో పైలట్‌గా ఉన్నారని తెలుస్తోంది.

 

టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ నుంచి ఏవియేషన్ రంగానికి..

 

ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన స్మిత్ మచ్ఛార్ జీవిత ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది. చిన్నప్పుడు కుటుంబానికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారంలోకే వెళ్లాలని భావించారు. స్కూల్ విద్య పూర్తయ్యాక టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతుండగా ఒక ఏవియేషన్ సెమినార్‌కు హాజరయ్యారు. అక్కడే ఆయనకు పైలట్ కావాలనే ఆసక్తి కలిగింది. 2007-2008 సమయంలో వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. తన 19 ఏళ్ల వయసులో పైలట్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబంలో భిన్నమైన స్పందన వచ్చింది. గతంలో జలక్ మెహతా అనే పాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు. “మా అమ్మ చాలా భయపడింది. 15-17 ఏళ్ల క్రితం ఏవియేషన్ రంగం ఇప్పుడు ఉన్నంత విస్తృతంగా లేదు. పైలట్లు అయ్యేవారు చాలా తక్కువ మంది ఉండేవారు. విమానాలు నడపడం అనే విషయాన్నే అమ్మ భయంగా భావించేది. కానీ నాన్న చాలా ప్రశాంతంగా నా నిర్ణయాన్ని సమర్థించారు,” అని స్మిత్ చెప్పారు.

 

సౌదీలో చికిత్స.. ప్రభుత్వం అండ

 

కత్తిపోట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్ఛార్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముంబై ఘాట్‌కోపర్ ఈస్ట్ ఎమ్మెల్యే పరాగ్ షా స్మిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన క్షేమంగా ఉన్నారని ధృవీకరించారు. మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆయన చికిత్స వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయి. స్మిత్ తల్లిదండ్రులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు.

 

ప్రపంచ నాయకుల ప్రశంసల వర్షం

 

స్మిత్ మచ్ఛార్ వీరత్వానికి ప్రపంచ దేశాల అధినేతలు దాసోహమైపోయారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ఒక రియల్ హీరో! అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యాన్ని, సడలని నిబద్ధతను ప్రదర్శించారు. ఆయన సాహసమే వందలాది ప్రాణాలను కాపాడి పెద్ద విషాదాన్ని తప్పించింది,” అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు కూడా స్మిత్ ధీరత్వాన్ని కొనియాడారు. “తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఎదురుతిరిగి పోరాడారు. కాక్‌పిట్ తలుపులు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునేలా చేశారు. ఇజ్రాయెల్ పౌరులతో పాటు174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్మిత్ నిజమైన కథానాయకుడు,” అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “ఆ కో-పైలట్ బహుశా ఉగ్రవాది అయి ఉండవచ్చు లేదా మానసిక స్థితి సరిగా లేనివాడై ఉండవచ్చు. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ స్మిత్ సమయస్ఫూర్తితో వ్యవహరించి సహాయం కోసం కేకలు వేశారు. ఆయన నిజంగా గొప్ప వీరుడు,” అని వ్యాఖ్యానించారు.

………..