Mahaa Daily Exclusive

  ఏపీ ప్రభుత్వం కన్నెర్ర…

Share

  • ఏపీ ప్రభుత్వం కన్నెర్ర
  • 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్
  • అనధికారికంగా గైర్హాజరే కారణం
  • కొత్త నియామకాలకు మార్గం సుగమం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి

అమరావతి, మహా : రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్న డాక్టర్లపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) పరిధిలో ఏడాదికిపైగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. ఏపీసీఎస్ (సీసీఏ) రూల్స్-1991లోని రూల్ నెంబర్ 20 ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసిన తరువాత, ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్‌హెచ్ చక్రధర్ బాబు వెల్లడించారు. తొలగించిన వారిలో గైనిక్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్ తదితర స్పెషాల్టీలకు చెందిన డాక్టర్లు ఉన్నారు. ఈ మేరకు డీఎస్‌హెచ్, డీఎంఈ అధికారులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పూర్తి వివరాలతో నివేదికను అందజేశారు.

మరొకవైపు డీఎస్‌హెచ్ పరిధిలోనే ఉన్న మరో 154 మంది గైర్హాజరీ డాక్టర్లపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు వేర్వేరు దశల్లో సాగుతున్నాయి. గతంలో నోటీసుల అనంతరం విధుల్లో చేరేందుకు ముందుకొచ్చిన 78 మంది డాక్టర్లకు ఇంక్రిమెంట్ల కోత వంటి క్రమశిక్షణా చర్యలతో కూటమి ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పించింది. ఇక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు దూరంగా ఉన్న 39 మంది డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ఇందులో ఐదుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. గత మే నెలలోనే డీఎంఈ పరిధిలో 51 మంది వైద్యులను సర్వీసు నుంచి తొలగించగా, ప్రస్తుతం తుది నోటీసులకు స్పందించకపోతే ఈ 39 మందిపై కూడా వేటు వేయనున్నట్లు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.

డాక్టర్లు ప్రభుత్వ విధుల్లో చేరిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడం, కేటాయించిన పోస్టింగ్‌లు నచ్చకపోవడం లేదా వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల విధులకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని (డీఎస్‌హెచ్, డీఎంఈ, ఎన్‌హెచ్‌ఎం, ఆయుష్, హెల్త్ యూనివర్సిటీ మొదలైనవి) పరిధిలో కలిపి మొత్తం 493 మంది డాక్టర్లు, సిబ్బంది అనధికారికంగా గైర్హాజరీలో ఉన్నట్లు లెక్క తేల్చారు. ప్రజారోగ్యం దృష్ట్యా డాక్టర్లు, వైద్య సిబ్బంది గైర్హాజరీల విషయంలో ఎలాంటి ఉపేక్ష వహించవద్దని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం తొలగింపు ప్రక్రియను గరిష్టంగా 3 నెలల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. డాక్టర్లు లేక ప్రజలకు వైద్య సేవలు దూరం కాకుండా ఉండేందుకు, ఖాళీ అయ్యే పోస్టులను జీరో వేకెన్సీ పాలసీ కింద వెంటనే కొత్త నియామకాలతో భర్తీ చేయాలని మంత్రి శాఖాపరమైన దిశా నిర్దేశం చేశారు.