Mahaa Daily Exclusive

  ఆటో ఛార్జీల పెంపు..

Share

  • ఆటో ఛార్జీల పెంపు
  • కనీస ఛార్జీ రూ. 30
  • 12 ఏళ్ల తర్వాత కొత్త రేట్లు

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఆటో ఛార్జీలను సవరిస్తూ తెలంగాణ రవాణా శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆటో మీటర్ ఛార్జీలను పెంచారు. కొత్త విధానం ప్రకారం ఇకపై మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ. 30 గా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ. 14 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కనీస ఛార్జీ రూ.20 ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11గా ఉండేది. రవాణాశాఖ సవరించిన ఛార్జీల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.30 కనీస ఛార్జీ వర్తిస్తుంది. 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 చొప్పున అదనంగా వసూలు చేయాలి. దీంతో స్వల్ప దూరాలకు వెళ్లే ప్రయాణికులపై కూడా కనీస ఛార్జీ రూపంలో అదనపు భారం పడనుంది. ఆటో ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, సిగ్నల్ వద్ద ఆగడం, ఇతర కారణాలతో వేచి ఉండాల్సి వస్తే డిటెన్షన్ ఛార్జీ నిమిషానికి 75 పైసలుగా నిర్ణయించారు. గతంలో ఇది 50 పైసలుగా ఉండేది. అలాగే నిబంధనలకు లోబడి అదనపు లగేజీ తీసుకెళ్లే సందర్భంలో ఒక్కో ప్యాకేజీకి 50 పైసలు ఛార్జీగా నిర్ణయించారు. గరిష్ఠ లగేజీ పరిమితిని 100 కిలోలుగానే కొనసాగించారు.

రాత్రి వేళల్లో ఆటోలో ప్రయాణించే వారికి ప్రస్తుతం ఉన్న నిబంధననే కొనసాగించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అంటే సాధారణ మీటర్ ఛార్జీ కంటే 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు తమ డిజిటల్ మీటర్లను కొత్త టారిఫ్‌కు అనుగుణంగా సవరించుకోవాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చింది. మీటర్ల రీసెట్టింగ్ పూర్తయ్యే వరకు పాత, కొత్త ఛార్జీల వివరాలతో కూడిన టారిఫ్ కార్డును ఆటోల్లో ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో ఆటో ఛార్జీలను చివరిసారిగా 2014లో సవరించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లే తెలంగాణలోనూ కొనసాగుతున్నాయి. 2014లో అమల్లోకి వచ్చిన రేట్లలో మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20.. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11గా ఉండేది. 12 ఏళ్లకు పైగా ఛార్జీల్లో మార్పు లేకపోవడంతో ఇంధనం, వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్, టైర్లు, మరమ్మతులు వంటి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తాజాగా రేట్ల సవరణ చేపట్టారు. ఆటో మెయింటెనెన్స్ ఖర్చులు, పెట్రోల్-డీజిల్ ధరలు, వాహన కొనుగోలు-ఫైనాన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, ట్రాఫిక్‌లో వేచి ఉండే సమయం, డ్రైవర్ల ఆదాయం వంటి అంశాలను పరిశీలించిన కమిటీ కొత్త రేట్లను సిఫారసు చేసింది. కమిటీ అంచనా ప్రకారం ఆటో నిర్వహణ వ్యయం రెవెన్యూ ఆర్జించే ప్రతి కిలోమీటర్‌కు సుమారు రూ.13.53గా ఉండటంతో దాన్ని రూ.14కు రౌండ్ చేసింది.