Mahaa Daily Exclusive

  హైదరాబాద్ పోలీస్‌లో భారీ మార్పులు…

Share

  • హైదరాబాద్ పోలీస్‌లో భారీ మార్పులు
  • 76 ప్రాంతాల్లో జోన్లు, డివిజన్ల మార్పు
  • ఎయిర్‌పోర్టు పీఎస్‌కు కొత్త పేరు

హైదరాబాద్, మహా : హైదరాబాద్ మహానగరంలో పోలీస్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్పులు చేసింది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా, మారుతున్న కాలనీలకు అనుగుణంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ జీవో నంబర్ 84 జారీ చేసింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పోలీసు పరిధులను పునర్వ్యవస్థీకరించినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త పునర్వ్యవస్థీకరణలో పలు పోలీస్ స్టేషన్ల పరిధులను ఒక జోన్ లేదా డివిజన్ నుంచి మరో జోన్, డివిజన్‌కు మార్చారు. కొన్ని ప్రాంతాలను ఇతర కమిషనరేట్ల పరిధిలోకి కూడా బదిలీ చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి తీసుకెళ్లారు.

అదే సమయంలో మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లోనూ పోలీస్ స్టేషన్ల పరిధులను సవరించారు. రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మీర్‌పేట్ ప్రాంతాలతో పాటు నగరంలోని కీలక ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ పోలీస్ పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణలో పేర్ల మార్పులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జీఐఏ) పోలీస్ స్టేషన్‌గా ఉన్న స్టేషన్‌ను ఇకపై శంషాబాద్ పోలీస్ స్టేషన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్‌జీఐఏ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా మార్చారు. దీంతో ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పోలీస్ పరిపాలనా వ్యవస్థను స్థానిక భౌగోళిక పరిధికి అనుగుణంగా మార్చినట్లైంది. పోలీస్ డివిజన్ల పేర్లలోనూ కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉన్న చిక్కడపల్లి డివిజన్‌ను కాచిగూడ డివిజన్‌గా.. సంతోష్‌నగర్ డివిజన్‌ను ఛత్రినాక డివిజన్‌గా మార్చరు. పోలీస్ స్టేషన్ల పరిపాలనా పరిధులను కూడా కొత్త డివిజన్లకు అనుగుణంగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో కాచిగూడ, ఛత్రినాక పోలీస్ స్టేషన్లు ప్రత్యేక స్టేషన్లుగా నమోదై ఉన్నాయి.

ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బడంగ్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, కాలనీలను సమీపంలోని ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోకి మార్చారు. ఏ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలను కొత్త సరిహద్దుల ప్రకారం ఖరారు చేశారు. దీంతో పోలీస్ సిబ్బంది, అధికారుల పరిధులు కూడా తాజా మార్పులకు అనుగుణంగా మారనున్నాయి. ఈ మార్పులు కేవలం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లకే పరిమితం కాలేదు. ట్రాఫిక్ పోలీస్ జోన్లు, డివిజన్ల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు, ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలపై స్పందించే పోలీస్ అధికారుల పరిధులు కూడా మారనున్నాయి. మహిళల భద్రతకు సంబంధించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధుల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ సైబర్ సెల్‌ల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. కొత్త పరిధుల ప్రకారం పోలీస్ అధికారుల పర్యవేక్షణ, ఫిర్యాదులపై స్పందన, దర్యాప్తు వంటి అంశాల్లో సమన్వయం మెరుగుపడేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో నగరం విస్తరిస్తుండటం, కొత్త కాలనీలు ఏర్పడటం, జనాభా పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ కమిషనరేట్ పరిధులను సవరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పోలీసింగ్‌ను మరింత సులభతరం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఉత్తర్వుల అమలుతో హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని అధికారులు ఇకపై సవరించిన జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల ఆధారంగా విధులు నిర్వహించనున్నారు.