*బీసీలకు అండగా నిలిచింది… నిలిచేది మేమే
*34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అప్పీల్
*రిజర్వేషన్లు అడ్డుకునేలా కోర్టుల్లో గొడ్డలి పార్టీ పిటీషన్లు
*రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రేపు శ్రీకారం
*సంక్షేమం-అభివృద్ధి- సుపరిపాలనతో ప్రతిచోటా ఫలితాలు
*రేపల్లె ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
*లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం
బాపట్ల
*రేపల్లె, అక్టోబర్ 01(మహ):-* బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అండగా నిలిచింది… నిలిచేది తామేనని ముఖ్యమమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బీసీలకు చేయూతను అందించే విషయంలో ఎక్కడా రాజీ పడబోమని తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజావేదికలో సీఎం ప్రసంగించారు. నాడు బీసీలకు రాజకీయంగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని.. తాను వారికి అండగా నిలబడి ప్రోత్సహించానని సీఎం అన్నారు. 1995లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తెచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను 24 శాతానికి కుదించిందన్నారు. తద్వారా 16,800 మంది పదవీ అవకాశాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ..” ఇప్పుడు మళ్లీ మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. 50 శాతం కంటే రిజర్వేషన్లు పెరగకూడదని కోర్టులో వాదించారు. కోర్టు ఆ జీవోలను కొట్టేసింది. దీనిపై రేపే ఈ సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్తున్నాం. వెనుకబడిన వర్గాలను ఆర్ధికంగా, సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తులు.. మేం మెగా డీఎస్సీ తో ఉద్యోగాలు ఇస్తే ఆరోపణలు చేస్తున్నారు. 350 కేసులు కోర్టుల్లో వేసి నియామక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెనుకబడిన వర్గాలపై ద్వేషంతో కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించే రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా బీసీలను రాజకీయంగా అండగా నిలబడే బాధ్యతను మేం తీసుకుంటాం. ఈ ప్రాంతంలో బీసీ బిడ్డ అనగాని భగవంతరావు చక్కగా పనిచేశారు. ఇప్పుడు మంత్రిగా అనగాని సత్యప్రసాద్ ప్రజల కోసం పనిచేస్తున్నారు. బీసీలుగా నాయకులు రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పించేది కూటమి ప్రభుత్వమే.” అని ముఖ్యమంత్రి అన్నారు.
*జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యం*
“గడచిన 28 నెలలుగా ప్రతీ నెలా మొదటి తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నాను. చీఫ్ మినిస్టర్ అంటే కామన్ మ్యాన్ అని నేను విశ్వసిస్తున్నాను. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ పనిచేస్తున్నాను. పేదలకు న్యాయం చేయాలన్న బాధ్యతతో మేం పనిచేస్తున్నాం. ప్రతినెలా నాలుగు మార్లు ప్రజల ముందుకు వస్తున్నాం. ప్రతీ నెలా 1 తేదీన పేదలకు ఆర్ధిక భద్రత కల్పించే పెన్షన్ల కార్యక్రమం, 9 తేదీన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. గత పాలకులు సృష్టించిన భూ వివాదాలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇక ప్రతిమూడో శనివారం పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి , 4వ శనివారం సంజీవని కార్యక్రమానికి హాజరవుతున్నాను. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని నిత్యం ప్రజా సేవకులుగా పనిచేస్తున్నాం. గడచిన రెండేళ్లుగా ప్రతీ వ్యక్తికి, ప్రతీ కుటుంబానికి సాధికారిత తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గొడ్డలి పార్టీ నేతలు ప్రజలు కొట్టిన దెబ్బకు అలిగి అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారు. గత పాలకులు అన్ని వ్యవస్థల్నీ భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు. కష్టంతో సంకల్పంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఒక్కో ఇటుకా పేరుస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తు్న్నాం. ఆర్ధిక సవాళ్లు అధిగమించి సంక్షేమం అందిస్తున్నాం. పెన్షన్లకే ఇప్పటికి రూ.76 వేల కోట్లు ఖర్చు చేశాం. వెంటిలేటర్ పై ఉన్న ఆర్దిక వ్యవస్థను కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు, బుల్లెట్ స్పీడ్ తో సుపరిపాలన అందిస్తున్నాం. పేదరికాన్ని ఆర్ధిక కోణంలో కాదు మానవీయ కోణంలో ఆలోచించి జీవన ప్రమాణాలు పెంచడానికి చూస్తున్నాం. సంక్షేమంతో పాటు పీ4 కార్యక్రమం ద్వారా అట్టడుగున 20 స్థాయి మందికి చేయూత అందించేలా చర్యలు చేపట్టాం. బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారి జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
*సంపద సృష్టికి మూలధన వ్యయం పెంచాం*
“రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో నివాసస్థలాల్లో పేదలకు పట్టాలు ఇచ్చాం. రూ.52 వేల కోట్ల విలువైన నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాం. పేదల కుటుంబాలకు చేయుతను ఇచ్చే అంశాన్ని ఆర్ధిక కోణంలో చూడటం లేదు. పేద కుటుంబాల్లో 3-4 పథకాల ద్వారా ఆర్ధిక సహకారం చేయూత అందుతోంది. స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం, మత్స్యకార సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో ఇలా వేర్వేరు పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 1 లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాం. మరో 5 లక్షల మందిని కూడా వ్యాపారవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతీ నెలా డబ్బులు ఇచ్చేసి వెళ్లడానికి రాలేదు. ప్రజలను కలిసి వారి బాగోగులు తెలుసుకోడానికి వస్తున్నాను. అట్టడుగుస్థాయి వ్యక్తికి ఆర్ధిక స్థోమత ఇచ్చి జీవన ప్రమాణాలు పెంచినప్పుడే అభివృద్ధి అదే నా సిద్ధాంతం. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా చేపడుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.11వేల కోట్ల పనులు చేపడుతున్నాం. గత పాలనలో రోడ్లన్నీ గోతులు తవ్వేశారు. గడచిన రెండేళ్లుగా వాటిని పూడ్చి రోడ్లు బాగు చేశాం. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రతీ పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ గా పర్యవేక్షిస్తాం. ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించటం ద్వారా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు గడచిన రెండేళ్లలో వచ్చాయి. సంపద సృష్టించేలా క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పెంచాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తున్నాం.రాయలసీమ జీవనాడి హంద్రినీవా మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి. వంద రోజుల్లో రూ.3,500 కోట్ల ఖర్చు చేసి చిట్టచివరి ప్రాంతమైన కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి మార్కాపురం వరకూ నీళ్లు తీసుకువచ్చాం. శ్రీశైలం మల్లన్న పాదాల నుంచి మార్కాపురం చెన్నకేశవ స్వామి చెంతకు కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ గోదావరి నీళ్లు తీసుకువెళ్లాం. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక రాష్ట్రంలో కరవు వచ్చింది. డ్రామాలు ఆడటానికి గొడ్డలి పార్టీ బయల్దేరింది. వరుణ దేవుడి కృపవల్ల మనకు సరైన సమయంలో కాస్త వర్షాలు పడ్డాయి. కృష్ణానదిలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా డెల్టాకు తెచ్చాం. గతంలో కేవలం 13 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తెచ్చాం.పోలవరం పూర్తి అయితే కృష్ణా, గోదావరి డెల్టాలకూ నీటి సమస్యే ఉండదు. పట్టిసీమ అనే నిర్ణయం ఇక్కడి రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. గొడ్డలి పార్టీ విమర్శలకు భయపడితే కృష్ణాడెల్టాకు నీళ్లు వచ్చేవి కావు. ప్రతిపక్ష పార్టీ అంటే పోటీ తత్వం ఉండాలి. కాని గొడ్డలి పార్టీకి కుట్రతత్వం ఉంది.అభివృద్ధికి ఆటంకాలు కలిగించటమే గొడ్డలి పార్టీ పని” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
*పర్యాటక ల్యాండ్ మార్క్‌గా సూర్యలంక*
“వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సి ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలి. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ గా మారుస్తున్నాం. రూ.1 లక్ష కోట్లతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తాం. ఉద్యాన పంటలతో పాటు లాజిస్టిక్స్ , పర్యాటకం ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు వస్తాయి.బాపట్లలోని సూర్యలంక బీచ్ దీనిని గోవా తరహాలో అభివృద్ధి చేస్తాం. పర్యాటకుల్ని ఆకర్షించేలా దీనిని తీర్చిదిద్దాలని ప్రణాళికలు చేస్తున్నాం. ఆ పర్యాటకుల్ని ఆకర్షించటం ద్వారా సూర్యలంక దేశ చిత్రపటంలో ఓ ల్యాండ్ మార్క్ గా మారాలి. వాన్ పిక్ ప్రాంతాన్ని గొడ్డలి పార్టీ అధినేత సర్వనాశనం చేశారు. అభివృద్ధే రాకుండా పోయింది. ఇష్టానుసారం అవినీతి చేసి సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్నాడు. వాన్ పిక్ ద్వారా అద్భుతమైన పారిశ్రామిక టౌన్ షిప్ తయారు కావాల్సిన ప్రాంతాన్ని నాశనం చేశారు. ప్రజలకు జవాబుదారీ పరిపాలన ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పించి మెరుగైన పౌరసేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ఐగాట్- మిషన్ కర్మయోగి కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నైపుణ్యాలను పెంచుతోంది. మన ఉద్యోగులు 2.2 కోట్ల కోర్సులు చేసి దేశంలోనే ఏపిని అగ్రస్థానంలో నిలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 4 వేల పైచికులు కోర్సులు చేసి నైపుణ్యాలు సాధించింది. ఇప్పుడు తన విద్యార్ధులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేందుకు ఆ నైపుణ్యాలు ఆమెకు ఉపయోగ పడుతున్నాయి. వ్యక్తిగతంగా మనం కూడా మనమన రోజువారీ కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూడటం కాకుండా నైపుణ్యాలు పెంచుకునే అంశంపై సమయం కేటాయించాలని కోరుతున్నాను.” అని సీఎం సూచించారు.
*అభివృద్ధి అంశంలో రాజీలేదు*
“గత పాలకులు పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మలు వేసుకోడానికి రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. రీసర్వే 2.0 ద్వారా భూవివాదాలు పరిష్కరించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. శెట్టిపల్లి, కంగుమంది, అమలాపురం తదితర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న భూసమస్యల్ని పరిష్కరించాం. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నాం. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాం. మరో 5.5 లక్షల ఇళ్లను త్వరలోనే నిర్మించి ఇస్తాం. పౌర సేవల్ని ప్రజలకు దగ్గర చేసేలా వాట్సప్ గవర్నెన్సు ద్వారా సేవలు అందిస్తు్న్నాం. డీప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక రోజులు, నెలలు పట్టాల్సిన పనులు ఇప్పుడు నిముషాల్లోనే పూర్తి అవుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంగా మనం అవకాశాలను అందిపుచ్చుకోవాలి. విశాఖకు డేటా సెంటర్లు తీసుకువస్తే గొడ్డలి పార్టీ నీటి సమస్య అంటూ అడ్డుపడుతోంది. అమరావతి అంటే ఎడారి అని, శ్మశానమని, మావిగన్ అంటున్నారు. అడ్డంకులకు ఆగిపోను, అభివృద్ధి విషయంలో రాజీ పడను. నాయకుడంటే ప్రజల రేపటి భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. అందుకే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నాను. సమాజంలో చిట్టచివరి వ్యక్తి జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాం. ఆదాయం, ఆరోగ్యం, ఆనందం అనే విధానంతో ముందుకు వెళ్తున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్, నేతలు మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.








