- ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం
- సర్, ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
- ఒక పార్టీకి అనుకూలంగా కొంత మంది అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, మహా : ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు వ్యవహారం తదితర అంశాలతో పాటు ఎన్నికల కమిషన్ తీరుపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్ల తొలగింపు విషయంలో ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే హైదరాబాద్‌లో పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరిస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని, ఈసీ కార్యాలయాన్ని తగలబెడతామని వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని దానం నాగేందర్ ఆరోపించారు. చాలాకాలంగా అదే ప్రాంతాల్లో ఉంటున్నవారివి.. గత ఎన్నికల్లో కూడా ఓటు వేసిన వారి పేర్లను కూడా ఇప్పుడు జాబితా నుంచి తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు ఇచ్చారని.. తొలగించిన పేర్లను పరిశీలించి అర్హులైన వారి ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని దానం డిమాండ్ చేశారు. ఖైరతాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఎస్ఐఆర్ నోటీసులు జారీ అయ్యాయని ఆయన గతంలోనూ పేర్కొన్నారు.
ఓట్ల తొలగింపు విషయంలో ఈసీ స్పందించకపోతే హైదరాబాద్‌లో పరిస్థితి సాధారణంగా ఉండదంటూ దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్లను పునరుద్ధరించకపోతే నిరసనలు, పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసీ ఆఫీస్, హైదరాబాద్ సిటీని తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తున్నారని దానం సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో కొందరు అధికారులు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా పేర్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఆయన ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2000, 2002 నుంచి అదే ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తులు, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్లుగా ఉన్నవారి పేర్లు ఇప్పుడు తొలగించారని దానం నాగేందర్ పేర్కొన్నారు. నిజమైన ఓటర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తొలగించిన ఓట్లను మరోసారి పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఓటర్ల జాబితాలో మార్పులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.








