Mahaa Daily Exclusive

  రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దు…

Share

  • రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దు
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం
  • బీసీలకు 34శాతం రిజర్వేషన్ల జీవోల కొట్టి వేసిన కోర్టు

అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే 104, 1065 జీవోలను హైకోర్టు రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని.. ఈ రిజర్వేషన్లు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు సీజే జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆరు వారాల్లో ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. సర్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషిన్, వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. మరికొన్ని వ్యాజ్యాలపై ధర్మాసనం ఇప్పటికే విచారణ పూర్తిచేసి తీర్పులు రిజర్వు చేయగా వాటిపై కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు వార్డులో విభజనలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు నో చెప్పలేదు.. ఎన్నికలు జరపాలని ఆదేశించింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని బీసీల జనాభా గణన చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేశాకే నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి బీసీలను ఉపవర్గీకరించి రిజర్వేషన్లు నిర్ణయించాలని మరొకరు హైకోర్టులో పిల్ వేశారు. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మరో పిటిషన్ దాఖలయ్యింది. అలాగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సమీపంలోని గ్రామ పంచాయతీల విలీనంపై కూడా పిటిషన్ దాఖలైంది. వీటితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం వార్డుల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టులో సవాల్ చేశారు. ఇటు ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మరో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిసన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చింది.