Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ ఉపఎన్నికు నిలిపి వేయండి..

Share

  • ఖైరతాబాద్ ఉపఎన్నికు నిలిపి వేయండి
  • హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి
  • దానం ఎన్నికను సవాల్ చేస్తూ గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన విజయారెడ్డి

హైదరాబాద్, మహా : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు సైతం దీనిని సమర్థించడంతో ఈ స్థానం ఖాళీ అయి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే, ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ దివంగత సీనియర్ నేత పి.జనార్దన్ రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ విజయారెడ్డి 2024లోనే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆమె రెండో స్థానంలో నిలిచారు. దానం నాగేందర్ సమర్పించిన అఫిడవిట్‌లో పలు అవకతవకలు ఉన్నాయని, నామినేషన్ నిబంధనలకు విరుద్ధంగా గెలుపొందారని, కాబట్టి ఆయన ఎన్నిక ఎంతమాత్రం చెల్లదని ఆమె ఆ పిటిషన్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్న తన ఎలక్షన్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నిర్వహణకు ఉపక్రమించవద్దని, అంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని ఆమె తాజా పిటిషన్‌లో కోరారు.

గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డి సమీప ప్రత్యర్థిగా రెండో స్థానంలో నిలిచారు. న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని తేలితే, మళ్లీ ఉపఎన్నిక నిర్వహించే అవసరం లేకుండానే రెండో స్థానంలో ఉన్న తనను విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విజయారెడ్డి విశ్వసిస్తున్నారు. అందుకే తక్షణమే ఉపఎన్నిక జరిపితే తన చట్టబద్ధమైన హక్కులకు భంగం వాటిల్లుతుందని, న్యాయస్థానం తన ఎలక్షన్ పిటిషన్‌పై తేల్చాకే ముందడుగు వేయాలని ఆమె భావిస్తున్నారు.

విజయారెడ్డి వేసిన ఈ పిటిషన్ కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్ అనర్హతతో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించిన పలువురు నేతలకు ఈ పిటిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఒకవైపు సొంత పార్టీకి చెందిన నేతే ఉపఎన్నికను అడ్డుకునేలా కోర్టును ఆశ్రయించడం, మరోవైపు ఉపఎన్నికల ముంగిట ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ రేసు హీటెక్కడం రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చేస్తోంది.

ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నిక భవితవ్యం పూర్తిగా తెలంగాణ హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. విజయారెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఉపఎన్నిక నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధిస్తుందా? లేక ఎలక్షన్ కమిషన్ యథావిధిగా షెడ్యూల్ విడుదల చేసేందుకు అనుమతినిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది. హైకోర్టు ఇవ్వబోయే స్పష్టతతోనే ఖైరతాబాద్‌పోరు తుది ఘట్టానికి చేరుకోనుంది.