ప్రజల రక్షణే ధ్యేయంగా హసన్ పర్తి పోలీస్
రహదారి పై విరిగిపడిన భారీ వృక్షం తొలగించిన పోలీసులు
ట్రాఫిక్‌ను పునరుద్ధరించిన హసన్ పర్తి పోలీసులు
హసన్ పర్తి మహా ;
ఓవైపు భారీ వర్షం మరోవైపు గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో భాగంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు ఆపద కాలంలో అండగా నిలిచిన హసన్ పర్తి పోలీస్ సిబ్బంది.. పోలీస్ విధుల్లో తమ మానవత్వాన్ని, కర్తవ్య దీక్షను చాటుకున్నారు. హసన్ పర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ మహేందర్ సారథ్యంలో సిబ్బంది చేసిన ఈ సమయోచిత రెస్క్యూ ఆపరేషన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి.
బుధవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల దాటికి ఎన్ హెచ్ – 563 హనుమకొండ నుండి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి పై ఆంధ్రా బ్యాంకు ఎదురుగా చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురై, రహదారి పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ విషయం తెలియగానే, అప్పటికే గణేష్ నిమజ్జన విధుల్లో నిమగ్నమై ఉన్న ఇన్స్పెక్టర్ ఏ. మహేందర్, హసన్ పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రంగంలోకి దిగి రహదారికి అడ్డంగా పడిన చెట్టు కొమ్మలను కత్తిరించి, రోడ్డుపై ఎలాంటి అడ్డు లేకుండా పూర్తిగా తొలగించారు. కేవలం కొద్ది సమయంలోనే వాహనాల రాకపోకలను పునరుద్ధరించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
విపత్కర పరిస్థితుల్లోనూ తక్షణమే స్పందించి, బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ ఏ. మహేందర్ ను అలాగే వారి సిబ్బందిని స్థానిక ప్రజలు, వాహనదారులు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.








