ఒకప్పుడు డబ్బు పంపడం అంటే సమయం, శ్రమ, నిరీక్షణలతో కూడిన ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని, భారీగా కమీషన్లు చెల్లించే దుస్థితి నుంచి.. క్షణాల వ్యవధిలో నిధులను బదిలీ చేసే అద్భుతమైన సాంకేతిక స్థాయికి నేడు భారతదేశం చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దార్శనిక విధానాలతో, కాగితాలకే పరిమితమైన భౌతిక ఆర్థిక వ్యవస్థ కాస్తా సామాన్యుడి చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోకి ఒదిగిపోయి దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికింది.
నిరీక్షణల మనీ ఆర్డర్ల నుంచి విముక్తి
గతంలో డబ్బు పంపే వ్యక్తి ముందుగా నగదు పట్టుకుని పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి ఫారాలు నింపి, రుసుము చెల్లించి రోజుల తరబడి ఎదురుచూడటం నిత్యకృత్యంగా ఉండేది. 2011-12 నాటి అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,54,822 పోస్టాఫీసులు ఉండగా, అందులో 1,39,086 కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందించేవి. ఆ ఒక్క ఏడాదిలోనే 6.99 కోట్ల మనీ ఆర్డర్లు, టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ల ద్వారా రూ.10,201 కోట్లకు పైగా లావాదేవీలు జరిగితే, వాటిపై తపాలా శాఖకు ఏకంగా రూ.482 కోట్ల కమీషన్ వసూలైంది. ఆ రోజుల్లో ప్రతి రూ.20కి రూ.1 చొప్పున అంటే ఐదు శాతం రుసుము వసూలు చేసేవారు. వెయ్యి రూపాయలు పంపితే 50 రూపాయలు కమీషన్‌కే పోయేది. బ్యాంకుల కౌంటర్ల వద్ద బారులు తీరడం, ప్రయాణ ఖర్చులు, వృథా అయ్యే సమయం సామాన్యుడికి గుదిబండగా మారిన ఆ పాత భౌతిక వ్యవస్థకు నేడు శాశ్వత పరిష్కారం లభించింది.
చారిత్రక మలుపుగా యూపీఐ ఆవిర్భావం
ఆనాటి మందకొడి వ్యవస్థతో పోలిస్తే నేటి భారతదేశంలో నగదు కదిలే విధానం ఒక చారిత్రక మలుపు తిరిగింది. 2016 ఏప్రిల్ 11న జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) కేవలం 21 బ్యాంకులతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఏకీకృత చెల్లింపు వ్యవస్థ (యూపీఐ), అదే ఏడాది ఆగస్టు నాటికి మొబైల్ అనువర్తనాల ద్వారా ప్రజల ముంగిటకు వచ్చింది. రిజర్వు బ్యాంకు, బ్యాంకింగ్ రంగం, సాంకేతిక సంస్థల సమిష్టి కృషితో రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వ దార్శనిక నిర్ణయాలు, ప్రోత్సాహకాలు తోడవడంతో ఇది ఒక సామూహిక ఉద్యమంగా మారింది. ఫలితంగా 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీలు, 2025-26 నాటికి అక్షరాలా 24,162 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేయడం ఈ పరివర్తన వేగానికి ప్రతీక. డబ్బు పంపాలంటే ఎక్కడికి వెళ్లాలనే పాత ప్రశ్న స్థానంలో, ఎవరికి పంపాలనే సరికొత్త సౌలభ్యాన్ని మోదీ సర్కార్ సాకారం చేసింది.
అంతర్జాతీయ స్థాయికి డిజిటల్ ప్రవాహం
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఫలాలు కేవలం పట్టణాలకే పరిమితం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో 2022లో కేంద్ర ప్రభుత్వం ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం సైతం ప్రత్యేక యూపీఐ సేవలతో పాటు, 24 గంటల సహాయ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వ్యవస్థపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి ఎన్పీసీఐ తాజా గణాంకాలే సజీవ సాక్ష్యం. 2026 జూలైలో 2,366 కోట్ల లావాదేవీల ద్వారా రూ.29.88 లక్షల కోట్లు బదిలీ కాగా, 2026 ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 752 బ్యాంకుల అనుసంధానంతో 24,508.96 మిలియన్ల (2,450.9 కోట్ల) లావాదేవీలు జరిగాయి. వీటి ద్రవ్య విలువ ఏకంగా రూ.29,82,355.95 కోట్లుగా నమోదై ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 2021-2025 మధ్య కాలంలో డిజిటల్ లావాదేవీలు 11 రెట్లు పెరగ్గా, అందులో యూపీఐ వాటా 80 శాతానికి చేరడమే కాకుండా, 2026 ఆగస్టు నాటి నివేదిక ప్రకారం ఏకంగా 11 దేశాలకు ఈ సేవలు విస్తరించడం నవ భారత సాంకేతిక సత్తాకు నిదర్శనం.
చిరు వ్యాపారుల దైనందిన జీవితాల్లో వెలుగులు
ఈ అద్భుతమైన మహావిప్లవం సామాన్యులతో పాటు చిన్న వ్యాపారుల జీవితాల్లోనూ ఊహించని గుణాత్మక పరివర్తనను తీసుకువచ్చింది. గతంలో వ్యాపారులు నగదు నిల్వలు కాపాడుకోవడం, రోజువారీ లెక్కింపులు చేసుకోవడం, చిల్లర సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడేవారు. ప్రతిరోజూ బ్యాంకుల్లో నగదు జమ చేయడానికి పడే శ్రమ అంతాఇంతా కాదు. కానీ నేడు ఆ కష్టాలన్నీ కనుమరుగయ్యాయి. చిన్న టీ దుకాణం మొదలుకొని కూరగాయల వ్యాపారి వరకు క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి అదనపు యంత్రాల అవసరం లేకుండానే అత్యంత సులభంగా ఆన్లైన్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న పటిష్టమైన మద్దతుతో చిల్లర కోసం కస్టమర్‌ను వెనక్కి పంపాల్సిన అవసరం లేని సురక్షిత, పారదర్శక వ్యాపార వాతావరణం నేడు పల్లెపల్లెనా పరిఢవిల్లుతోంది.
అపోహల ఖండన.. ప్రభుత్వ ప్రోత్సాహకాల దన్ను
యూపీఐ సేవలు విస్తరిస్తున్న కొద్దీ పన్నులు విధిస్తున్నారంటూ తెరపైకి వస్తున్న అపోహలను 2026 సెప్టెంబర్ 15న కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా ఖండించింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలన్నీ సంపూర్ణంగా ఉచితమని, వినియోగదారుడు వ్యాపారికి చేసే రూ.2,000 వరకు చెల్లింపులపైనా ఎలాంటి రుసుము ఉండదని స్పష్టం చేసింది. నెలకు రూ.లక్ష లోపు యూపీఐ చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు శూన్య వ్యాపారి తగ్గింపు రుసుము (ఎండీఆర్) కొనసాగుతుందని, 96 శాతం లావాదేవీలు కొత్త రుసుములకు అతీతమని కుండబద్దలు కొట్టింది. 2025 ఏప్రిల్‌లో రూ.2000 దాటితే జీఎస్టీ పడుతుందన్న ప్రచారం పచ్చి అబద్ధమని తేల్చింది. బ్యాంకుల సర్వర్ల నిర్వహణ, సైబర్ భద్రతకు భారీగా ఖర్చవుతున్నా ఆ భారం సామాన్యుడిపై పడకుండా, చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు 2025 ఆర్థిక సంవత్సరంలో మోదీ కేబినెట్ ఏకంగా రూ.1,500 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలపడం పేదల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది.
నిరంతర భద్రత.. చేతికొచ్చిన కార్యాలయం
సాంకేతికత ఎంత సౌలభ్యాన్ని ఇచ్చినా ఉచితం కదా అని భద్రతాపరమైన జాగ్రత్తలు విస్మరించకూడదని రిజర్వు బ్యాంకు పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. డబ్బు స్వీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సంఖ్య (పిన్) నమోదు చేయాల్సిన అవసరం లేదని, లావాదేవీని నిర్ధారించే ముందు గ్రహీత వివరాలు సరిచూసుకోవాలని సూచిస్తోంది. నకిలీ క్యూఆర్ కోడ్లు, సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్రం, ఆర్బీఐ నిరంతరం మౌలిక వసతులను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. మనీ ఆర్డర్ యుగం నుంచి మొబైల్ చెల్లింపుల దాకా సాగిన ఈ ప్రయాణాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే.. ఒకప్పుడు డబ్బు పంపడానికి మనిషి కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ కార్యాలయమే మన చేతిలోని ఫోన్లోకి వచ్చేసింది. ఇది ముమ్మాటికీ భారతీయ డిజిటల్ ప్రజా మౌలిక వసతుల విజయగాథ.. నవ భారతదేశ అద్భుత ప్రగతికి, ప్రభుత్వ విధానాల దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యం.
గడల నరసింహారావు.అసోసియేట్ ఎడిటర్, మహాపత్రిక








