- తెలంగాణ లో దూకుడు పెంచిన జనసేన పార్టీ
- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు
వరంగల్ బ్యూరో మహా ;
ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్ భద్రాద్రి కొత్తగూఢెం కు చెందిన డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును ముందస్తుగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో పనిచేసిన ఆయనకు వైద్య రంగంలో సేవలందించిన అనుభవం ఉంది. జనసేన జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ .. గడల శ్రీనివాసరావు పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వానికి పవన్ కల్యాణ్ సుముఖత వ్యక్తం చేయడంతో పార్టీ ముందస్తుగా పేరును ప్రకటించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యావంతులు, మేధావులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తానన్నారు. వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు తనకు ఆశీస్సులు అందించాలని కోరారు.
తన పై నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్, రామ్ తాళ్లూరి, శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.






