Mahaa Daily Exclusive

  భోగాపురం ఎయిర్‌పోర్టుకు పవన్‌ ‘గ్రాండ్‌ వెల్‌కమ్‌’..

Share

  •  ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు!
  •  ‘అల్లూరి పేరుతో నిర్మితమైన ఈ విమానాశ్రయం.
  •  దశాబ్దాల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం’.
  •  పెట్టుబడులు, ఉద్యోగాలకు భారీ అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో మరో చారిత్రక అధ్యాయం మొదలైందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభం కావడం రాష్ట్ర ప్రగతిలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్‌ కావడం రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో అద్భుత ఘట్టమని పేర్కొన్నారు.

విమాన సేవల ప్రారంభంపై పవన్‌ కల్యాణ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యాలను విస్తరించే ప్రాజెక్టు మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలకు సాకారం అని పేర్కొన్నారు.

‘ఇది కేవలం విమానాశ్రయం కాదు.. ఉత్తరాంధ్ర ఆకాంక్షలకు ప్రతిరూపం’

భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి దేశ, విదేశీ రవాణా అనుసంధానం మరింత బలపడనుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాణిజ్య, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర చరిత్ర, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పెట్టుబడులకు ‘గేట్‌వే’.. యువతకు ఉద్యోగాల ఆశలు

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. విమాన కనెక్టివిటీ పెరగడంతో పారిశ్రామిక సంస్థలు, వ్యాపారాలు, పర్యాటక రంగం విస్తరించే అవకాశం ఉందన్నారు.

దీంతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. విమానాశ్రయం చుట్టూ అనుబంధ మౌలిక వసతులు అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

‘దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదగాలి’

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదగాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందిస్తూ రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం శాశ్వత మైలురాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

విశాఖ–ఉత్తరాంధ్రకు కొత్త ‘అభివృద్ధి ఇంజిన్‌’

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కార్యకలాపాలకు భోగాపురం విమానాశ్రయం మరింత విస్తృత కనెక్టివిటీని అందించనుంది.

హైదరాబాద్‌ నుంచి తొలి విమానం భోగాపురం గడ్డపై దిగడంతో.. ఉత్తరాంధ్ర దశాబ్దాల కలకు రెక్కలు వచ్చాయి. అల్లూరి పేరుతో ప్రారంభమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధికి కొత్త గేట్‌వేగా మారుతుందన్న ఆశాభావాన్ని పవన్‌ కల్యాణ్‌ వ్యక్తం చేశారు.