Mahaa Daily Exclusive

  వియత్నాంలో పిల్లుల దొంగల ముఠా గుట్టురట్టు…

Share

వియత్నాంలో పిల్లుల దొంగల ముఠా గుట్టురట్టు.
* మాంసం కోసం 2,700 పెంపుడు పిల్లుల అపహరణ.. 12 మంది అరెస్టు.

హోచిమిన్ సిటీ,మహా:

వియత్నాంను గత కొంతకాలంగా బెంబేలెత్తిస్తున్న భారీ పిల్లుల దొంగల ముఠా గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. సుమారు 2,700 పెంపుడు పిల్లులను దొంగిలించి, మాంసం కోసం విక్రయించిన ఒక భారీ ముఠాకు చెందిన 12 మందిని హోచిమిన్ సిటీలో అరెస్టు చేశారు. పెంపుడు జంతువులను అపహరించి అక్రమ రవాణా చేస్తున్న ఈ ముఠా కార్యకలాపాలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ ముఠాకు 39 ఏళ్ల ల్యూ థాన్ బిన్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అకృత్యాలకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ల్యూ థాన్ బిన్ తన అనుచరులతో చిన్నచిన్న బృందాలను ఏర్పాటు చేసి రాత్రివేళల్లో నగరంలోని వివిధ నివాస ప్రాంతాలపైకి ఉసిగొల్పేవాడు. ప్రధానంగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ ఈ బృందాలు పిల్లులను పట్టుకునేవి. చేప ముక్కలను ఎరగా వేసి బోనుల్లో పిల్లులను బంధించి, అనంతరం వాటిని మోటార్‌సైకిళ్లపై రహస్యంగా తరలించేవారు. ఇలా ఒక్కో బృందం ప్రతి రాత్రి నాలుగు నుంచి పది పిల్లులను అపహరించేదని నిందితులు విచారణలో అంగీకరించారు. దొంగిలించిన పిల్లులన్నింటినీ కొనుగోలు చేసే ల్యూ థాన్ బిన్, వాటిని నగర ఉత్తర భాగంలోని ఒక రహస్య స్థావరంలో ఉంచి, అక్కడినుంచి కబేళాలకు, మాంసం వ్యాపారులకు విక్రయించేవాడు.
పక్కా సమాచారంతో ఈ ముఠా రహస్య స్థావరంపై దాడి చేసిన పోలీసులకు కళ్లు చెదిరే ఆధారాలు లభించాయి. నిందితుల నుంచి 50 సజీవ పిల్లులతో పాటు 55 బోనులు, రెండు తూకం యంత్రాలు, రెండు వెంట్రుకలు తొలగించే యంత్రాలు, 14 గోనె సంచులు, 13 మొబైల్ ఫోన్లు, ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 50 పిల్లుల్లో 13 పిల్లులను అధికారులు వాటి యజమానులకు సురక్షితంగా అప్పగించారు. మిగిలిన వాటిని ఒక జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) సంరక్షణ కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించారు.
వియత్నాం సంప్రదాయంలో కుక్క, పిల్లి మాంసం తినే అలవాటు పాత తరం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లి మాంసం తింటే అదృష్టం వస్తుందనే మూఢనమ్మకం కూడా అక్కడ కొంతమందిలో ఉంది. అయితే వియత్నాం చట్టాల ప్రకారం పెంపుడు జంతువులను వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తారు. వాటిని దొంగిలించడం చట్టరీత్యా నేరం. దొంగిలించిన జంతువుల విలువ 20 లక్షల డాంగ్స్ (సుమారు 77 డాలర్లు) దాటితే నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇటీవల కాలంలో వియత్నాంలో పెంపుడు జంతువుల పెంపకం పెరగడంతో యువత వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటోంది. కుక్క, పిల్లి మాంసం వ్యాపారాన్ని నిషేధించాలని కోరుతూ 2024లో ఏకంగా రెండున్నర లక్షల మంది సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ క్రమంలో ఒకేసారి వేల సంఖ్యలో పిల్లులను కాపాడటం వియత్నాం వ్యాప్తంగా జంతు ప్రేమికులకు ఊరటనిచ్చింది.