అహ్మదాబాద్‌లో బాంబు బెదిరింపుల కలకలం.
* ఏకకాలంలో పది పాఠశాలలు, నరేంద్ర మోదీ స్టేడియానికి ఈ-మెయిల్స్.
అహ్మదాబాద్,మహా.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో బుధవారం బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు నగరంలోని పది ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఏకకాలంలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం నగరవ్యాప్తంగా భయాందోళనలకు దారితీసింది. ఉదయం 11:11 గంటలకు పాఠశాలలను పేల్చివేస్తామంటూ ఆ దుండగులు మెసేజ్‌లలో హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే పాఠశాలల నుంచి విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు పంపించారు. సమాచారం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలలకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.
బెదిరింపులు వచ్చిన సమయంలో నరేంద్ర మోదీ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఉదయం 11:15 గంటలకే ఆట ముగియడంతో క్రీడాకారులు మధ్యాహ్నం 1 గంట తర్వాత భద్రత నడుమ క్షేమంగా బసకు బయలుదేరి వెళ్లారు. ఇదే ఈ-మెయిల్‌లో ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్‌జీత్ దోసాంజ్ భవిష్యత్తులో నిర్వహించనున్న సంగీత విభావరి (కన్సర్ట్) ప్రస్తావన కూడా ఉండటం గమనార్హం. ఆ కన్సర్ట్‌కు హాజరయ్యే వారికి రక్షణ ఉండదంటూ నిందితులు అందులో హెచ్చరించారు. ఈ బెదిరింపుల వెనుక ‘ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ’తో ముడిపడి ఉన్నట్లుగా భావిస్తున్న ఈ-మెయిల్ ఐడీలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) కార్యదర్శి అనిల్ పటేల్ సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రోహిత్ చౌదరి సైతం అన్ని పాఠశాలల యాజమాన్యాలను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెంటనే బాంబు నిర్వీర్య బృందం , అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసు బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకుని అణువణువూ విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇదంతా ఆకతాయిల పనేనని (హోక్స్) అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ-మెయిల్స్ వచ్చిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్‌లు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని, ప్రశాంతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.








